2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:38 AM
పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
ఆగస్టు 15కు ముందే అనకాపల్లికి గోదావరి జలాలు
గోదావరి, నాగావళి అనుసంధానం పూర్తి చేస్తాం
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
‘పోలవరం’తో రాష్ట్ర ప్రజలకు భావోద్వేగ బంధం: మాధవ్
పోలవరం, రాజమహేంద్రవరం అర్బన్, జూలై 16(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎంపీ పురందేశ్వరి నివాసం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బస్సులో వచ్చారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రితోపాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పీవీ పార్థసారఽథి, ఎన్.ఈశ్వరరావు, వి.విష్ణుకుమార్ రాజు ఇతర నేతలు పాల్గొన్నారు. బృందం రాజమహేంద్రవరం నుంచి గోదావరి ఎడమ గట్టును ఆనుకుని పురుషోత్తపట్నం మీదుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. మార్గమధ్యలో హిల్ వ్యూ, స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, పవర్ హౌస్ ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలను స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు మునుపే విడుదల చేసి అక్కడే అఖండ హారతి నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి నాగావళి నదుల అనుసంధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ పోలవరం పూర్తికి నిధులు సమకూర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఓ ఎమోషనల్ బాండింగ్ అన్నారు.