పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:07 AM
సీడబ్ల్యూసీ, విదేశీ నిపుణుల సూచనలతో నాణ్యతలో రాజీ లేకుండా పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
మార్చి నెలాఖరుకు డయాఫ్రంవాల్ సిద్ధం
ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ స్థలిలో వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి: నిమ్మల
పోలవరం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సీడబ్ల్యూసీ, విదేశీ నిపుణుల సూచనలతో నాణ్యతలో రాజీ లేకుండా పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్ నిర్మాణం, గ్యాప్ 1, గ్యాప్ 2, ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని ఈఎన్‌సీ ఎన్.నరసింహమూర్తి మంత్రికి వివరించారు. ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఆధునిక దేవాలయం. దీనిని పూర్తిచేసి ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగు, తాగునీరు అందించి కరువు రహిత రాష్ట్రంగా చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం తో ధ్వంసమైన డయాఫ్రంవాల్‌ని సరిచేస్తే సరిపోతుందని నిపుణులు చెప్పినా... నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే కొత్త డయాఫ్రంవాల్ నిర్మించాం. సీడబ్ల్యూసీ డిజైన్ల ప్రకారం అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రమాణాలు పాటిస్తూ ప్రాజెక్టు అథార్టీ పర్యవేక్షణలో పనులు చేస్తున్నాం. కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణం 1,372 మీటర్లకు గాను 1,300 మీటర్ల వరకూ పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు నిర్మాణం పూర్తవుతుంది..’ అని పేర్కొన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం గ్యాప్-1 డిజైన్లకు సీడబ్ల్యుసీ ఆమోదం
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గ్యాప్-1 డిజైన్లకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యుసీ) ఆమోదం తెలిపింది. కాగా, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల్లో కదలిక వచ్చింది. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా రామకోటేశ్వరరావును నియమిస్తూ మంగళవారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు.