Share News

పోలవరం.. నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:34 AM

పోలవరం నిర్వాసితులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీఎం చంద్రబాబు రూ.226 కోట్ల పరిహారం సొమ్మును ఉగాది కానుకగా ఇవ్వడమే దీనికి కారణం. అంతేకాదు..

పోలవరం.. నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం

  • వారికి ఒక రోజు ముందే ఉగాది: ముఖ్యమంత్రి

  • మూడో దఫా రూ.226 కోట్ల పరిహారం చెల్లింపు

  • ఉండవల్లిలో లాంఛనంగా చెక్కుల పంపిణీ

  • వారంలోగా కొత్త డయాఫ్రం వాల్‌ సిద్ధం

  • వచ్చే ఉగాది తర్వాత 2 నెలల్లో ప్రాజెక్టు తొలిదశ పూర్తి: సీఎం

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. రాష్ట్ర ప్రజల కల నెరవేరుస్తాం. దీని నిర్మాణంతో నదుల అనుసంధాన ప్రక్రియ జోరందుకుంటుంది. ఫలితంగా రాష్ట్రం మొత్తానికీ ప్రయోజనం కలుగుతుంది.

- సీఎం చంద్రబాబు

పోలవరం నిర్వాసితులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీఎం చంద్రబాబు రూ.226 కోట్ల పరిహారం సొమ్మును ఉగాది కానుకగా ఇవ్వడమే దీనికి కారణం. అంతేకాదు.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ 21 నెలల్లో మూడు దఫాలు పరిహారం చెల్లించడం వారికి ఎంతో సంతృప్తినిస్తోంది. ప్రాజెక్టు పనులు చకచకా సాగుతుండడం.. అది పూర్తయ్యేముందే పూర్తి పరిహారం చెల్లిస్తామని.. నిర్వాసితుల కుటుంబాల్లోని యువతకు ఉపాధి శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం.. భవిష్యత్‌పై వారికెంతో ధీమానిస్తోంది.

అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును.. భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే వారందరికీ పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ప్రధాన నిర్మాణాలు, తొలిదశ పూర్తికి మరో రూ.5 వేల కోట్లు కావాలన్నారు. ప్రాజెక్టును వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ముందే దీనిని జాతికి అంకితం చేస్తామన్నారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. వారికి మూడో దఫా పరిహారంగా రూ.226 కోట్ల చెక్కును లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉగాది పర్వదినానికి ఒక రోజు ముందే నిర్వాసితుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025 జనవరిలో సంక్రాంతిని పురస్కరించుకుని రూ.800 కోట్లు ఇచ్చామని.. రెండో విడతగా దీపావళి సందర్భంగా రూ.916 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రస్తుత రూ.226 కోట్లతో కలిపి ఈ 21 నెలల్లోనే 26,149 మంది నిర్వాసితులకు రూ.1,943.53 కోట్లు చెల్లించామని వివరించారు. వారి కుటుంబాల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


రెండు దశల్లో నిర్మాణం..

పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తున్నాం. తొలిదశలో 38,058 మంది నిర్వాసితులు ఉన్నారు. వీరికి నిర్మించాల్సిన 75 పునరావాస కాలనీల్లో ఇప్పటిదాకా 26 పూర్తయ్యాయి. మిగతా 49 కాలనీల నిర్మాణం ఈ ఏడాది డిసెంబరునాటికి పూర్తవుతాయి. ఇందుకోసం రూ.3,500 కోట్లు వ్యయం చేస్తున్నాం. ప్రతి నిర్వాసితుడికీ ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షలు చెల్లిస్తున్నాం. ఇందులో ఇంటి జాగా కోసం 2 లక్షలు ఇస్తున్నాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. ప్రాజెక్టు కేంద్రానిదైనా రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పూర్తి చేస్తోంది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పులను సరి చేస్తూ నిర్వాసితులకు లబ్ధి చేకూరుస్తున్నాం. జగన్‌ నిర్వాకంతో ప్రాజె క్టు ఆరేడేళ్లు వెనక్కి పోయింది. కాంట్రాక్టు సంస్థను, ఇంజనీరింగ్‌ అధికారులను మార్చకుండా ఉంటే.. ఈపాటికి నిర్వాసితులకు పరిహారం అందేది.

పనుల్లో పారదర్శకత..

జగన్‌ నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లోనే పనుల వేగం పెంచాం. ఇప్పుడు కొత్త వాల్‌ నిర్మాణం చేప ట్టాం. అది వారం రోజుల్లో పూర్తవుతుంది. గోదావరి పుష్కరాలను మూడోసారి నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిస్తాం.

నిర్వాసితుల భావోద్వేగం..

అనూహ్యంగా మూడోసారి పరిహారం అందడంతో నిర్వాసితులు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. జగన్‌ పాలనలో న్యాయం జరగలేదని.. కూటమి ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించిందని.. తమ ఖాతాల్లోకి పరిహారం డబ్బులు చేరాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలకాలం పాలన సాగించాలని మహిళలు భావోద్వేగంతో పేర్కొన్నారు. కార్యక్రమంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్‌ సాయిప్రసాద్‌, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 05:34 AM