నిర్వాసితులందరికీ పరిహారం
ABN , Publish Date - May 16 , 2026 | 03:52 AM
పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి.. నిర్వాసితులైన త్యాగధనులెవరూ పరిహారం అందలేదన్న ఆవేదనకులోనుకాకుండా చూడాలని...
పోలవరం కోసం త్యాగం చేసిన ఏ ఒక్కరినీ మిస్ చేయొద్దు
లబ్ధిదారుల జాబితాలో లేనివారి కోసం సర్వే చేయండి: సీఎం
నిర్వాసితులకు రూ.306 కోట్ల పంపిణీ
పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులెవరూ నష్టపోకూడదు. నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేశాం. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టులు, పరిశ్రమలు, టౌన్‌షి్‌పలు.. ఇలా ఏ అభివృద్ధి ప్రాజెక్టుకైనా భూములిచ్చి త్యాగాలు చేసేది రైతులే. నిర్వాసితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను.
పోలవరం నిర్వాసితులకు పరిహారం పెంచుతామని నమ్మించి జగన్ మోసం చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. పోలవరం కాంట్రాక్టు సంస్థను, అధికారులను జగన్ మార్చేశాడు. ప్రాజెక్టును నాశనం చేశాడు. 2024లో మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును గాడిలో పెట్టాం. గోదావరి పుష్కరాలకు ముందే తొలిదశ పనులు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం.
- చంద్రబాబు
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి.. నిర్వాసితులైన త్యాగధనులెవరూ పరిహారం అందలేదన్న ఆవేదనకులోనుకాకుండా చూడాలని జల వనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చినా.. నిర్వాసితుల జాబితాల్లో పేర్లు లేనివారిని గుర్తించాలని, దీనికిగాను సమగ్ర సర్వే చేపట్టాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భూ పరిహార చట్టానికి లోబడి వారు అర్హులో కారో గుర్తించాలని కోరారు. ఈ ప్రక్రియలో ఎక్కడా కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. అనర్హులకు పరిహారం చెల్లిస్తే భవిష్యత్తులో చిక్కులు ఎదుర్కొంటారని అధికారులను హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారంతా త్యాగమూర్తులేనని, వారికి సాయం అందించడంలో మానవీయకోణంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పోలవరం నిర్వాసిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు చెక్కులు అందించారు. మొత్తం రూ.306.61 కోట్ల పరిహారాన్ని చెల్లించారు. అదేవిధంగా పలువురు లబ్ధిదారులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు సంబంధించిన ఇంటి తాళాలను సీఎం అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, భూమికి భూమి కింద 520.02 ఎకరాలను గుర్తించామని నిర్వాసితులకు చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పోలవరం భూసేకరణ, పునరావాస శాఖ కమిషనర్ ప్రశాంతి, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి పాల్గొన్నారు.
ఇది నాలుగోసారి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం నిర్వాసితులకు నాలుగోసారి పరిహారాన్ని అందించామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 2025లో సంక్రాంతి, దీపావళి సందర్భంగా రెండుసార్లు, ఈ ఏడాది ఉగాది సందర్భంగా మూడోసారి, తాజాగా శుక్రవారం సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి జయంతి సందర్భంగా నాలుగోసారి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. మొత్తం 29,936 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,259 కోట్ల మేర పరిహారం చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. అన్నింటికంటే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులంటే ప్రత్యేక అభిమానం ఉందని సీఎం చెప్పారు.
అదే జరిగితే..
గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గంగ-కావేరి నదుల అనుసంధానం కూడా జరగాలన్నదే తన కలగా పేర్కొన్నారు. గంగ-కావేరి అనుసంధానం జరిగితే దేశంలో ఎక్కడా కరువు ఉండదన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో బ్రహ్మాండమైన రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. 2022 వరద సమయంలో పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటించానని గుర్తు చేశారు. వరద బాధితులకు నీరు, ఆహారం కూడా జగన్ ప్రభుత్వ ఇవ్వలేదని తెలిపారు. విశాఖలో హుద్ హుద్ తుఫాను సమయంలో వారం రోజులపాటు విశాఖలోనే బసచేశానని గుర్తు చేశారు. 2019లోనూ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే 2020 నాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యంతోనే డయాఫ్రమ్‌వాల్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతికి ఉద్యోగం
ఈ సందర్భంగా నిర్వాసితుల కుటుంబంలోని ఓ యువతి తనకు చదువున్నా ఉద్యోగం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఆమెకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని సీఎంవో కార్యదర్శి రాజమౌళికి సూచించారు. మరో మహిళ తన ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆమెకు అప్పటికప్పుడే సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.
తొలిదశ నాటికి అందరికీ: నిమ్మల
పోలవరం తొలిదశ పూర్తయ్యేనాటికి నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిర్వాసితులను దళారులు మోసం చేయకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. 2027, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేస్తామన్నారు.
జగన్ చేతులెత్తేశారు
పలువురు నిర్వాసితులు చంద్రబాబుతో ముఖాముఖి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంపై తమకు భరోసా కలిగిందని తెలిపారు. పరిహారం అందుతోందని, ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో నిర్వాసితులకు ఇచ్చేందుకు డబ్బులు లేవని అప్పటి సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పరిహారం విషయంలో తానేమీ చేయలేనని జగన్ చేతులెత్తేయడంతో తాము కుమిలిపోయామని నిర్వాసితులు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు గత ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేదన్నారు. అప్పటి వరదల సమయంలో సర్వస్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీసం బియ్యం కూడా పంపిణీ చేయలేదని చెప్పారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డ 23 నెలల్లోనే 4 విడతలుగా తమకు పునరావాస సాయం దక్కడం సంతోషంగా ఉందన్నారు.