పోలవరం ప్రాజెక్టులో కేంద్ర బృందం నాణ్యతా పరీక్షలు
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:28 AM
కేంద్ర బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టులో పర్యటించింది. కీలకమైన ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పలు పరీక్షలు నిర్వహించింది.
పోలవరం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టులో పర్యటించింది. కీలకమైన ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పలు పరీక్షలు నిర్వహించింది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని సెంట్రల్ సాయిల్-మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్‌ఎస్)కు చెందిన నిపుణులు సిద్ధార్థ్ పి.హెడవూ, శ్రీహరి టి.నాయర్, అమిత్ సేన్ ఈ బృందంలో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈసీఆర్‌ఎఫ్ డ్యాంలో 300 మీటర్ల నుంచి 400 మీటర్లు, 1100 మీటర్ల నుంచి 1300 మీటర్ల చైనేజీ పరిధిలో మట్టి, రాళ్లు, ఇసుక, రింగ్ నాణ్యతను, పటుత్వాన్ని పరీక్షించారు. సోమవారం కూడా పరీక్షలు నిర్వహిస్తారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ బృందం వెంట మేఘా సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.శంకరయ్య, జలవనరుల శాఖ డీఈఈలు శ్రీనివాస్, అనీల్ పాల్గొన్నారు. ప్రతి నెలా సీఎస్ఎంఆర్‌ఎస్ బృందం ప్రాజెక్టులో నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.