Share News

పోలవరం పనుల్లో ప్రమాదం

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:23 AM

పోలవరం ప్రాజెక్టు గ్యాప్‌ 2 ప్రాంతంలో సీపేజీ జలాల్లో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక ప్రాజెక్టు ఇంజనీర్‌ మృతి చెందగా ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ గల్లంతయ్యాడు.

పోలవరం పనుల్లో ప్రమాదం

  • సీపేజీ జలాల్లో పడిపోయిన ఎక్స్‌కవేటర్‌

  • దానిని తీసేందుకు ప్రయత్నిస్తూ పడిపోయిన ఆపరేటర్‌

  • అతడిని రక్షించబోయి ఇంజనీర్‌ మృతి.. ఆపరేటర్‌ గల్లంతు

పోలవరం, జూలై 27(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు గ్యాప్‌ 2 ప్రాంతంలో సీపేజీ జలాల్లో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక ప్రాజెక్టు ఇంజనీర్‌ మృతి చెందగా ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ గల్లంతయ్యాడు. పోలవరం ఎస్‌ఐ పి.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు గ్యాప్‌ 2 ప్రాంతంలో సీపేజీ జలాలను డీవాటరింగ్‌ చేసే క్రమంలో కాలువ తీయడానికి వినియోగిస్తున్న ఎక్స్‌కవేటర్‌ గత శనివారం సీపేజీ జలాల్లో పడిపోయింది. దానిని సోమవారం క్రేన్‌తో బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఎక్సకవేటర్‌ ఆపరేటర్‌ తాకాసి నాగేశ్వరరావు (50) నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న మెకానికల్‌ ఇంజనీరు కోడూరి రవికాంత్‌(30) అతడిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో ఇద్దరూ నీటిలో గల్లంతయ్యారు. మరో ఇద్దరు ఒడ్డుకి చేరుకున్నారు. అక్కడే ఉన్న మిగిలిన కార్మికులు రవికాంత్‌ను బయటకు తీశారు. అతడు అపస్మారక స్థితిలో ఉండటంతో పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు చెప్పారు. గల్లంతయిన ఎక్సకవేటర్‌ ఆపరేటర్‌, చినకొండేపూడి గ్రామానికి చెందిన తాకాసి నాగేశ్వరరావు ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక మత్య్సకారుల సహకారంతో గోదావరిలో గాలింపు సాగిస్తున్నాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో చినకొండేపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన నాగు కుటుంబ సభ్యులు, బంధువులు గోదావరి తీరానికి చేరుకుని రోదిస్తున్నారు. కాగా మృతుడు రవికాంత్‌ స్వస్థలం విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెద్దబొడ్డుపల్లి.

Updated Date - Jul 28 , 2026 | 05:24 AM