Share News

అబట్మెంట్‌ డిజైన్లు భేష్‌

ABN , Publish Date - May 29 , 2026 | 05:02 AM

ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పనులకు సంబంధించి గ్యాప్‌-2లో కొండను కలిపే అబట్మెంట్‌ డిజైన్లపై విదేశీ నిపుణుడు సిన్‌ హించ్‌బెర్గర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

అబట్మెంట్‌ డిజైన్లు భేష్‌

  • ఈసీఆర్‌ఎఫ్‌ను, గ్యాప్‌-2 కొండను కలిపే డిజైన్లపై హించ్‌బెర్గర్‌ సంతృప్తి

  • నేడు పీపీఏ ఈసీవోతో ప్రత్యేక భేటీ

అమరావతి, పోలవరం, మే 28(ఆంధ్రజ్యోతి): ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పనులకు సంబంధించి గ్యాప్‌-2లో కొండను కలిపే అబట్మెంట్‌ డిజైన్లపై విదేశీ నిపుణుడు సిన్‌ హించ్‌బెర్గర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రధాన డ్యామ్‌ పనులకు ‘ఆప్రీ’ రూపొందించిన డిజైన్లపై ఆయన దాదాపు రెండున్నర గంటలపాటు పోలవరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు విదేశీ నిపుణులు హించ్‌ బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ బుధవారం రావాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాల వల్ల డొనెల్లీ రాలేదు. హించ్‌ బెర్గర్‌ ఒక్కరే బుధవారం రాజమండ్రికి చేరుకున్నారు. తొలిరోజు పోలవరం ప్రాజెక్టులో ప్రధాన కట్టడాలను పరిశీలించిన ఆయన రెండో రోజైన గురువారం డయాఫ్రమ్‌ వాల్‌పై వేస్తున్న ఈసీఆర్‌ఎ్‌ఫను పరిశీలించారు. కుడి, ఎడమ కాలువల టన్నెళ్లను, బంకమట్టి రీచ్‌ను పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని కేంద్ర జల సంఘం ఆమోదించిన మేరకు చేపడుతుండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండున్నర గంటలపాటు ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ తీరును, 25 మీటర్ల ఎత్తులో గ్యాప్‌-2 కొండకు ఈసీఆర్‌ఎ్‌ఫను కలుపుతూ చేపట్టే అబట్మెంట్‌ డిజైన్లనూ పరిశీలించారు. ఈ డిజైన్లపై బెర్గర్‌ సంతృప్తి వ్యక్తం చేయడంతో దీన్ని పీపీఏ ద్వారా కేంద్ర జల సంఘం ఆమోదానికి పంపనున్నారు. పర్యటనలో చివరి రోజైన శుక్రవారం హించ్‌ బెర్గర్‌ ప్రత్యేకంగా రాజమండ్రిలోని పీపీఏ కార్యాలయంలో సీఈవో సంజీవ్‌ వోరాతో సమావేశమవుతారు. మూడు రోజుల పర్యటనలో పరిశీలించిన పనులపై కెనడాకు చేరుకున్నాక.. హించ్‌ బెర్గర్‌ నివేదికను ఇవ్వనున్నారు. కాగా, ఈ పర్యటనలో కేంద్ర జలవనరుల సంఘం చీఫ్‌ ఇంజనీర్‌ సరబ్జిత్‌సింగ్‌ బక్షి, డైరెక్టర్‌ మనీష్‌ రాథోడ్‌, ఉప సంచాలకులు అశ్వనీ కుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, జలవనరులశాఖ ఉప కమిషనర్‌ గౌరవ్‌ సింఘాయ్‌, కేంద్ర మట్టి, రాతి పదార్థాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సచిన్‌ గుప్త, రవి అగర్వాల్‌, పీపీఏ ముఖ్య కార్య నిర్వహణాధికారి సంజీవ్‌ వోహ్రా, సభ్య కార్యదర్శి ఎం.రఘురామ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.రమేష్‌ కుమార్‌, ఏపీ జలవనరులశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్‌ చీఫ్‌ నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రరావు, మేఘా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రఫీ, జీఎం గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి పాల్గొన్నారు.


ముగిసిన నాణ్యతా పరీక్షలు

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి, రాతి పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) బృందం నిర్వహిస్తున్న పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈసీఆర్‌ఎఫ్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో బృందం నిపుణులు సిద్థార్థ్‌ పి హెడవూ, శ్రీహరి టి నాయర్‌, గౌరవ్‌ పాండే గ్యాప్‌-2 ప్రాంతంలోను మట్టి, రాతి పదార్థాల నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. డీఈలు డి.శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, విజయ్‌ కుమార్‌, మేఘా జీఎం ఎ.గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య జలవనరులశాఖ అధికారులు, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 05:02 AM