Share News

15 నెలల్లో తొలిదశ పూర్తిచేయాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:24 AM

పోలవరం ప్రాజెక్టుకు అవసరమైనన్ని నిధులను అందిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్‌ కాంతారావు హామీ ఇచ్చారు.

15 నెలల్లో తొలిదశ పూర్తిచేయాలి

  • ప్రాధాన్య ప్రాజెక్టులకూ నిధులు అందజేస్తాం: కాంతారావు

  • నల్లమలసాగర్‌ పీఎఫ్‌ఆర్‌ను ఆమోదించాలని నిమ్మల వినతి

అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు అవసరమైనన్ని నిధులను అందిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్‌ కాంతారావు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు తొలిదశ 15 నెలల్లోనే పూర్తవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలని మంత్రి నిమ్మల రామానాయుడితో అన్నారు. రాజమహేంద్రవరంలో కాంతారావును మంత్రి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, కలెక్టర్‌ కీర్తి చేకూరి కలిశారు. కాంతారావు మాట్లాడుతూ.. పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది మార్చి-జూన్‌ మధ్య పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ వెంటనే రెండోదశ పనులు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. గోదావరి జలాలు ఏటా 3,000 టీఎంసీల దాకా వృథాగా సముద్రంలో కలుస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం-(బనకచర్ల)నల్లమల సాగర్‌ ప్రాజెక్టును తలపెట్టామని కాంతారావుకు వివరించారు. ఈ ప్రాజెక్టు పీఎఫ్‌ఆర్‌ను ఆమోదించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కాంతారావు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలను పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 26 , 2026 | 03:24 AM