పోలవరం రెండో దశపై నేడు స్పష్టత!
ABN , Publish Date - May 01 , 2026 | 04:19 AM
పోలవరం తొలిదశ పనులు తుది అంకానికి చేరుతుండడంతో.. 45.72 మీటర్ల ఎత్తున 194.6 టీఎంసీల గరిష్ఠ నీటినిల్వ కోసం ప్రాజెక్టు రెండో దశను పట్టాలెక్కించే కార్యాచరణకు కేంద్రం సిద్ధమైంది.
ఢిల్లీలో విస్తృతస్థాయి సమావేశం.. సీఎస్ సాయిప్రసాద్ హాజరు
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం తొలిదశ పనులు తుది అంకానికి చేరుతుండడంతో.. 45.72 మీటర్ల ఎత్తున 194.6 టీఎంసీల గరిష్ఠ నీటినిల్వ కోసం ప్రాజెక్టు రెండో దశను పట్టాలెక్కించే కార్యాచరణకు కేంద్రం సిద్ధమైంది. దీని కార్యాచరణపై శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు నిర్వహిస్తున్న ఈ భేటీకి జలవనరుల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ హాజరవుతున్నారు. కేంద్ర జలసంఘం, కేంద్ర పర్యావరణం-అటవీ శాఖ, కేంద్ర భూసేకరణ, సహాయపునరావాస శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), వాప్కోస్, సీఎ్‌సఎంఆర్‌ఎస్ అధికారులతో జరిగే ఈ సమావేశంలో జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు కూడా పాల్గొననున్నారు. రెండో దశపై ఈ సందర్భంగా పూర్తి స్పష్టత వస్తుందన్న విశ్వాసాన్ని జల వనరుల శాఖ వ్యక్తం చేస్తోంది. తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లింపు దాదాపు ముగింపు దశకు వచ్చింది. రెండో దశలో మొత్తంగా 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇంకా 67,946 మందికి భూసేకరణ పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. ఈ భూసేకరణపై లక్ష్యాలను నిర్దేశించాలని.. సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు నెలవారీ టార్గెట్లు విధించాలన్న యోచనలో తాము ఉన్నట్లు ఇటీవల ఢిల్లీలో జరిగిన భేటీలో సాయిప్రసాద్‌కు కాంతారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణ బాధ్యతలను నిరంతరం పీపీఏ పర్యవేక్షించాలి. ఈ బాధ్యతను పీపీఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కో్‌సకు అప్పగించింది. అయితే వాప్కోస్ ఈ బాధ్యతలను సీరియ్‌సగా నిర్వర్తించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్న సమయంలో ఆ సంస్థ పూర్తి పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలని కాంతారావు ఆదేశించారు ఇప్పటికే కొత్త డయాఫ్రం వాల్ పూర్తయింది. దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులు ఆరంభమయ్యాయి. ఇవి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. వచ్చే మార్చినాటికే పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పూర్తయితే ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు మార్గం సుగమవుతుంది. అయితే దానికి ముందుగా.. 45.72 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇంకోవైపు.. ముంపు సమస్య పరిష్కారానికి కూడా కాంతారావు చర్యలు తీసుకుంటున్నారు. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిసి సంయుక్త సర్వేలు జరపాలని, వాటి అనుమానాలను, అభ్యంతరాలను నివృత్తి చేయాలని కేంద్ర జల సంఘాన్ని ఆదేశించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుపై స్టాప్ వర్క్ ఆర్డర్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.