AP CM Chandrababu: పోలవరం ఎంతో ప్రత్యేకం
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:46 AM
పోలవరం యూనిక్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి కాగానే, రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానిస్తామని తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో నదులన్నీ అనుసంధానం
వచ్చే నెల 15 నాటికి డయాఫ్రమ్ వాల్ సిద్ధం
పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తాం
గంగా-కావేరీ అనుసంధానం నా స్వప్నం: సీఎం
‘‘సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చు. దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకు? గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే మేం ఏనాడూ అడ్డు చెప్పలేదు. కానీ, పోలవరం - నల్లమల సాగర్‌పై తెలంగాణ నేతలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. వాటిని వాడుకుని దేవాదుల ప్రాజెక్టును తెలంగాణ విస్తరించుకుంటే ఎవరు కాదంటారు? కానీ, పోలవరం జలాలను ఏపీ వినియోగించుకుంటే అభ్యంతరం చెప్పడం తెలంగాణకు తగునా?’’
- సీఎం చంద్రబాబు
పోలవరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పోలవరం యూనిక్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి కాగానే, రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానిస్తామని తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో ప్రధాన డ్యామ్ పనుల పురోగతిని బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి ఆయన పరిశీలించారు అధికారులతో సమావేశమై ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. గతంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం రూ.445 కోట్లతో పూర్తిచేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు కొనసాగించి ఉంటే, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేది. కానీ, కాంట్రాక్టరు, అధికారులను జగన్ మార్చేశారు. దీంతో ప్రాజెక్టుకు భారీనష్టం జరిగింది. డయాఫ్రమ్‌వాల్ దెబ్బతిన్న విషయం గుర్తించేందుకు జగన్ ప్రభుత్వానికి చాలా సమయం పట్టింది. కేంద్రమే అంతర్జాతీయ నిపుణుల కమిటీని వేసి, డయాఫ్రమ్‌వాల్ కొత్తది నిర్మించాలని సూచించింది. దీంతో రూ.1,000 కోట్లతో నిర్మాణం చేపట్టాం. వచ్చేనెల 15నాటికి పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. మెయిన్ డ్యామ్ పనుల పూర్తికి చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ‘‘ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-2 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించాను. 2027 జనవరి నాటికి 41.15 మీ.
కాంటూరులో 119 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో భూ నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తిచేయాలని స్పష్టం చేశాను’’ అని తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద అంతర్గత జల రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను సొరంగాల ద్వారా అనుసంధానిస్తామని తెలిపారు. ‘‘2014-19లో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల కోసం జల వనరుల శాఖ రూ.65వేల కోట్లు వ్యయం చేసింది. ఇందులో ఒక్క రాయలసీమలోనే రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ ప్రభుత్వం తన హయాంలో కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే, నన్ను అరెస్టు చేశారు’’ అని తెలిపారు. పోలవరం స్టాండ్ ఎలోన్ ప్రాజెక్టు కాదని, ఇది ఒక నెర్వ్ సెంటర్ అని అభివర్ణించారు. కర్నూలు మినహా రాష్ట్రమంతటికీ పోలవరం జలాలు వెళతాయని తెలిపారు. ‘‘గోదావరి- కృష్ణాడెల్టా అనుసంధానం జరగాలి. రాయలసీమలో 368 టీఎంసీల జలాలు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నాయి. ఒక పంటకే నీళ్లు ఇవ్వలేని స్థితి నుంచి నేడు రెండు పంటలకు నెల్లూరు జిల్లాకూ అందిస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.