పోలవరం చకచకా!
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:12 AM
రాష్ట్ర జీవనాడి పోలవరం సాగునీటి ప్రాజెక్టును నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత నెల 25వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టి
గోదావరి పుష్కరాల నాటికి తొలిదశ పూర్తి
నిర్దేశిత లక్ష్యం చేరేలా వరుస సమీక్షలు
రేపు జలవనరుల శాఖతో జలశక్తి కార్యదర్శి భేటీ
15న సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష
ఇప్పటికే కొత్త డయాఫ్రమ్‌వాల్ పూర్తి
ఇక ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులపై ఫోకస్
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం సాగునీటి ప్రాజెక్టును నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత నెల 25వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల ప్రగతిపై ఓ అవగాహనకు వచ్చారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తవుతాయన్న విశ్వాసానికి వచ్చారు. దీంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాప్కోస్, సీఎస్ఎంఆర్‌ఎస్‌తో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ప్రత్యేకంగా ఢిల్లీలో శ్రమ్‌శక్తి కార్యాలయంలోని తన చాంబర్‌లో కాంతారావు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టును లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలపై సమీక్షిస్తారు. డిజైన్‌లు, 2026-27తో పాటు 2029 ఆర్థిక సంవత్సరం దాకా అందించాల్సిన నిధులపైనా కాంతారావు చర్చిస్తారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా భవిష్యత్తులో విడుదల చేయాల్సిన నిధులపై కాంతారావు నిర్ణయం తీసుకుంటారు. ఒకవైపు కేంద్రం పోలవరం నిర్మాణాన్ని సకాలంతో పూర్తి చేసేలా అడుగులు వేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన మాట ప్రకారం గోదావరి పుష్కరాల్లోపు ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అధికారుల ముందుంచారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు పోలవరం ప్రాజెక్టును సందర్శించాక రూ.1301 కోట్లను విడుదల చేశారు. దీంతో పోలవరం ప్రధాన పనుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకమూ లేకుండా జోరుగా కొనసాగుతున్నాయి.
నిర్మాణ పనుల వేగాన్ని ఇదేవిధంగా కొనసాగించేలా సూచనలు చేసేందుకు ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి పోలవరం ప్రగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైంది. నాటి ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త డయాఫ్రమ్‌వాల్‌ను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, చివరి ప్రధాన కట్టడం ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఇందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డయాఫ్రమ్‌వాల్‌ను నిర్దేశిత లక్ష్యం మేరకు ఈ నెల మూడో తేదీన పూర్తి చేశారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి కనీసం రెండు సీజన్ల సమయం పడుతుంది. కానీ అంత సమయం తీసుకోకుండానే పూర్తి చేశారు. ఇప్పటికే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించారు. వీలైతే వచ్చే ఏడాది మార్చి నాటికే పోలవరం ప్రాజెక్టు తొలిదశ లో 41.15 మీటర్ల కాంటూరులో గోదావరి జలాలు నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యాలను అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు.