ఇంటింటికీ పోలవరం ‘వెలుగులు’!
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:22 AM
పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టులో భాగంగా జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం 1,770 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి జరుగుతుండగా..
శరవేగంగా జల విద్యుత్ కేంద్రం పనులు
2027 జూలై నాటికి 3 యూనిట్లు సిద్ధం
ప్రస్తుతం 60 శాతం మేరకు పనులు పూర్తి
12 యూనిట్లు.. 960 మెగావాట్ల సామర్థ్యం
ఆసియాలోనే అతిపెద్ద కప్లాన్ టర్బయిన్లు
రోజుకు 2.3 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి
ఏడాదికి రూ.1100 కోట్ల విలువైన కరెంట్
రాష్ట్ర ఇంధన భద్రతలో కీలక మైలురాయి
పోలవరం అంటే కేవలం సాగు, తాగునీటి ప్రాజెక్టేకాదు.. ఇంటింటా వెలుగులు విరజిమ్మే విద్యుత్ ప్రాజెక్టు కూడా! గోదావరి నీటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 గోదావరి పుష్కరాల నాటికి మూడు యూనిట్లను సిద్ధం చేసి.. విద్యుత్‌ను అందించే దిశగా జెన్కో అధికారులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. 2028నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు తక్కువ ధరలకే విద్యుత్ లభించనుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టులో భాగంగా జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం 1,770 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి జరుగుతుండగా.. పోలవరం విద్యుత్ కేంద్రం పూర్తయితే రాష్ట్రానికి మరో 960 మెగావాట్ల మేరకు విద్యుత్ సమకూరనుంది. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఇంధన భద్రతకు కీలకంగా మారనుంది. గోదావరి నది ఎడమ గట్టుపై జల విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కటి 80 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 12 జనరేటింగ్ యూనిట్లు ఉంటాయి. తొలి యూనిట్‌లో టర్బయిన్ ఇన్‌స్టాలేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్న కప్లాన్ టర్బయిన్లను ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ సరఫరా చేస్తోంది. టర్బయిన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జనరేటర్లను, ఎలక్ట్రో మెకానికల్ పరికరాలను కూడా బీహెచ్‌ఈఎల్ సంస్థే అందిస్తోంది. ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించేలా ఏర్పాటు చేస్తున్న అధునాతన గ్యాస్ ఇన్సులేటెడ్, ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ వ్యవస్థలను సీమెన్స్ ఎనర్జీ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహిస్తోంది.

ఆసియాలోనే అతిపెద్ద టర్బయిన్లు
పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టులో కప్లాన్ టర్బయిన్లను వినియోగిస్తున్నారు. నది.. ఎక్కువ నీటి ప్రవాహాన్ని కలిగి, ప్రవాహం ఎత్తు తక్కువగా ఉండే పరిస్థితుల్లో జల విద్యుత్ ఉత్పత్తికి కప్లాన్ టర్బయిన్లను వినియోగిస్తారు. పోలవరం వద్ద గోదావరి ప్రవాహ తీరుతెన్నులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు సాధారణ కప్లాన్ టర్బయిన్ల స్థానంలో భారీ కప్లాన్ టర్బయిన్లను వినియోగించాలని నిర్ణయించారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద వర్టికల్ కప్లాన్ టర్బయిన్లను(నిట్టనిలువుగా ఉండేవి) ఈ ప్రాజెక్టులో ఉపయోగిస్తున్నారు. ఇవి అత్యధిక నీటి ప్రవాహాన్ని తీసుకుని జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టులోని ప్రతి యూనిట్ సెకనుకు 331 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహాన్ని తీసుకుని, నిమిషానికి 100 భ్రమణాల వేగంతో పనిచేస్తుంది. నీటి ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉన్నా అత్యున్నత సామర్థ్యాన్ని కప్లాన్ టర్బయిన్లు అందిస్తాయి.
వృథా జలాల సద్వినియోగం
గోదావరి నుంచి సుమారు 2వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో సమృద్ధిగా వచ్చే నీటిని, అలాగే గోదావరి డెల్టా సాగు అవసరాలకు నీటిని విడుదల చేసే సమయంలోనూ సమర్థవంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉన్న సమయంలో తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేసి, రాష్ట్ర గ్రిడ్‌ను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పీక్ ఆపరేషన్‌లో రోజుకు సుమారు 23 మిలియన్(2.3 కోట్ల) యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఈ ఉత్పత్తి కోసం రోజుకు 12 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. వార్షిక ఉత్పత్తి సుమారు 2500 మిలియన్ యూనిట్లుగా అంచనా వేస్తున్నారు. ఆర్థికంగానూ ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి లాభదాయకం కానుంది.
ధరా భారం డౌన్
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.57 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు వల్ల వార్షిక ప్రయోజనం సుమారు రూ.1100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విద్యుత్ కొనుగోలును తగ్గించుకోవడంతోపాటు వినియోగదారులకు ధరలను స్థిరీకరించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం సివిల్, ఎలకో్ట్ర మెకానికల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి యూనిట్‌లో టర్బయిన్ ఇన్‌స్టాలేషన్ పనులు జరుగుతున్నాయి. 2027 జూలై నాటికి గోదావరి పుష్కరాల సందర్భంగా కనీసం మూడు జనరేటింగ్ యూనిట్లను ప్రారంభించాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయి. 2028 జనవరి నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.