Share News

6 నెలలు ముందే పోలవరం తొలిదశ

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:02 AM

పోలవరం ప్రధాన డ్యాం పనులు కార్యాచరణ ప్రణాళికల కంటే శరవేగంగా సాగుతున్నాయని విదేశీ నిపుణులు ప్రశంసించారు. 2027 డిసెంబరు నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తి కావలసి ఉండగా..

6 నెలలు ముందే పోలవరం తొలిదశ

  • శరవేగంగా కార్యాచరణ ప్రణాళికలు

  • క్వాలిటీ కంట్రోల్‌ బాగుంది: విదేశీ నిపుణులు

  • జలసంఘానికి, పీపీఏకి అధ్యయన నివేదిక

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రధాన డ్యాం పనులు కార్యాచరణ ప్రణాళికల కంటే శరవేగంగా సాగుతున్నాయని విదేశీ నిపుణులు ప్రశంసించారు. 2027 డిసెంబరు నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తి కావలసి ఉండగా.. ఆరు నెలలు ముందే అంటే వచ్చే ఏడాది జూన్‌లోనే పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ ధీమాగా చెబుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిపుణులు డేవిడ్‌ బి.పాల్‌, గియాస్‌ ఫ్రాంకో డి.సిక్కో (అమెరికా), సీస్‌ హించ్‌బెర్జర్‌ (కెనడా).. జనవరి 18 నుంచి 22 దాకా క్షేత్రస్థాయి పర్యటన చేసిన సంగతి తెలిసిందే. మరో కెనడా నిపుణుడు రిచర్డ్‌ డొనెల్లీ స్వదేశం నుంచే ఆన్‌లైన్‌లో పర్యవేక్షించారు. జనవరి 23వ తేదీన ఈ బృందం ఢిల్లీలో కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమావేశమై పర్యటనలో పరిశీలించిన అంశాలను ప్రాథమిక నివేదిక రూపంలో అందజేశారు. తాజాగా మంగళవారం జలసంఘానికి,పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి అధ్యయన నివేదికను సమర్పించారు. గత పర్యటనలో గుర్తించిన లోపా లు, ఇతర సాంకేతికాంశాలనూ కాంట్రాక్టు సంస్థ సరిదిద్దుకుందని తెలిపారు. డయాఫ్రం వాల్‌ వద్ద బ్లీడింగ్‌ గుర్తించామని.. దాని ఎత్తు పెంచడం.. డి-వాల్‌పైన ప్లాస్టిక్‌ సిమెంట్‌తో నున్నగా ప్లాస్టింగ్‌ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. ఇందులో సాంకేతికపరమైన లోపాలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం చేయాలని జల సంఘానికి సూచించా రు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రిస్క్‌ రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచాలని నిపుణుల బృందం సూచించింది. క్వాలిటీ ఎష్యూరెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ విధానం బాగున్నట్లు తెలిపింది. దిగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ నివారణ చర్యలు చేపట్టాలని.. అలాగే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణ సమయంలో గోదావరి జలాలు ఎగజిమ్మకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Updated Date - Apr 02 , 2026 | 04:02 AM