కాలినడకన పోలవరం తొలి కలెక్టర్
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:23 AM
పోలవరం జిల్లా తొలి కలెక్టర్ దినేశ్‌కుమార్ గిరిజనం చెంతకు 15 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి వారి మనసులు చూరగొన్నారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రం...
15 కిలోమీటర్లు నడిచి గిరిజనులతో మమేకం
సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చిన దినేశ్‌కుమార్
మారేడుమిల్లి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా తొలి కలెక్టర్ దినేశ్‌కుమార్ గిరిజనం చెంతకు 15 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి వారి మనసులు చూరగొన్నారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రం రంపచోడవరం నుంచి కారులో బయలుదేరి పాతకోట పంచాయతీ తంగేడుకోట చేరుకున్నారు. అక్కడి నుంచి కొత్తగా ఏర్పడిన గుర్తేడు మండలం సింగనకోటకు రోడ్డు మార్గం లేకపోవడంతో రానుపోనూ.. 15 కిలో మీటర్లు నడిచి ఆ గ్రామాన్ని సందర్శించారు. గిరిజనులతో కలిసి నేలపైనే కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటా తిరిగి అక్కడి పరిస్థితు లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. అంగన్‌వాడీ కేంద్రం, తాగునీరు, రోడ్డు సౌకర్యం, 11 గిరిజన కుటుంబాలకు అటవీ హక్కులచట్టం ద్వారా పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపడతానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత పాతకోట గ్రామ సచివా లయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. గుర్తేడు పీహెచ్‌సీ సిబ్బంది పనితీరును ఆరా తీశారు. గ్రామంలో గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేశారు.