సుందరంగా పోలవరం
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:57 AM
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, ఈసీఆర్‌ఎఫ్ సుందరీకరణ డిజైన్లు తుదిరూపానికి వచ్చాయి. సంప్రదాయం, ఆధునికత కలయికలో జపాన్‌కు చెందిన నిప్పాన్ కోయి ఆర్కిటెక్చర్ సంస్థ వీటిని రూపొందించింది.
డిజైన్లకు తుదిరూపు.. 13న సీఎంచే ఖరారు
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, ఈసీఆర్‌ఎఫ్ సుందరీకరణ డిజైన్లు తుదిరూపానికి వచ్చాయి. సంప్రదాయం, ఆధునికత కలయికలో జపాన్‌కు చెందిన నిప్పాన్ కోయి ఆర్కిటెక్చర్ సంస్థ వీటిని రూపొందించింది. ఈ డిజైన్లపై గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి హాజరయ్యారు. ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లినప్పుడు ఈ డిజైన్లను పరిశీలించి ఖరారుచేస్తారు. అదే రోజు పోలవరం టూరిజం హబ్‌ను కూడా ఆయన ప్రకటిస్తారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో పర్యాటక హబ్ కోసం ఇటీవల లైడార్ సర్వే కూడా చేశారు. ఎన్‌హెచ్ 365బీబీ (సూర్యాపేట-కొవ్వూరు), నుంచి ఎన్‌హెచ్ 516ఈ(రాజమండ్రి-విజయనగరం)లను పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానించేలా భారత జాతీయ రహదారుల సంస్థతో రాష్ట్రప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. పోలవరం నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకూ టూరిజం హబ్‌గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి విశిష్టత చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హట్స్, ఎమ్యూజ్‌మెంట్ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.