బాబోయ్.. మళ్లీ పులొచ్చింది!
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:20 AM
కొద్ది నెలల క్రితం ఏలూరు జిల్లా ఏజెన్సీ వాసులను హడలెత్తించిన పెద్దపులి ఇప్పుడు మళ్లీ హడలెత్తిస్తోంది! గోదావరి దాటి పోలవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు గుర్తించారు.
రెండు నెలల క్రితం ఏలూరు ఏజెన్సీలో హల్‌చల్
పోలవరంలోకి ప్రవేశించినట్లు రేడియో ట్రాకర్ ద్వారా గుర్తింపు
పోలవరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కొద్ది నెలల క్రితం ఏలూరు జిల్లా ఏజెన్సీ వాసులను హడలెత్తించిన పెద్దపులి ఇప్పుడు మళ్లీ హడలెత్తిస్తోంది! గోదావరి దాటి పోలవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. గతంలో పట్టుబడినప్పుడు పులి మెడకు అమర్చిన రేడియో ట్రాకర్ ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి పోలవరం జిల్లా అటవీ ప్రాంతం నుంచి పోలవరం నిర్వాసిత కొత్తూరు గ్రామంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. దీంతో ప్రజలెవ్వరూ అడవిలోకి, పశువులను మేపడానికి, గోదావరిలో చేపల వేటకు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పులి కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు పోలవరం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఎస్‌కె వలీ తెలిపారు. ట్రాప్ కెమెరాలు అమర్చి 36 గ్రామాల్లో నిఘా ఉంచినట్టు జిల్లా అటవీశాఖాధికారి వెంకట్ సందీ్‌పరెడ్డి తెలిపారు.