Share News

సోలార్‌.. బేజార్‌!

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:16 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని మెటీరియల్‌ కొరత వెంటాడుతోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పాదకరంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం సూర్యఘర్‌ పథకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

సోలార్‌.. బేజార్‌!

  • పీఎం సూర్యఘర్‌కు మెటీరియల్‌ కొరత

  • కేంద్ర నిబంధనతో పథకం నత్తనడక

  • ప్యానెళ్లలో దేశీయ సోలార్‌ సెల్స్‌ వాడాలని షరతు

  • నిబంధన పాటించకపోతే సబ్సిడీ రద్దు

  • దేశీయ సెల్స్‌కు ఒక్కసారిగా డిమాండ్‌.. కొరత

  • 80-120ు ధరలు పెంచేసిన కంపెనీలు

  • ఫలితంగా సూర్యఘర్‌ అమలులో తీవ్ర జాప్యం

  • రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తులు 10.32 లక్షలు

  • ఇప్పటి వరకు పరిష్కరించినవి 1.71 లక్షలే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని మెటీరియల్‌ కొరత వెంటాడుతోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పాదకరంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం సూర్యఘర్‌ పథకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా రూఫ్‌టాప్‌ సోలార్‌ను ఏర్పాటు చేసుకుందామనుకునే వారు నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు పీఎం కుసుమ్‌ పథకంపైనా కేంద్ర నిర్ణయం ప్రభావం పడుతోంది. దేశీయ ఉత్పాదకరంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ నెల 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధనలో భాగంగా దేశీయంగా తయారైన సోలార్‌ సెల్స్‌ ఉన్న ప్యానెళ్లను (డొమెస్టిక్‌ కంటెంట్‌ రిక్వైర్‌మెంట్‌-డీసీఆర్‌ కాంప్లియంట్‌) మాత్రమే సూర్యఘర్‌ పథకంలో వాడాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటించని వారికి కేంద్రం ఇచ్చే సబ్సిడీని వర్తింపచేయబోమని ప్రకటించింది.


ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో కొత్త సమస్యలు తీసుకొచ్చింది. మన దేశానికి ఏటా సుమారు 200 గిగావాట్ల సోలార్‌ మాడ్యూల్‌ (ప్యానెళ్లు) తయారీ సామర్థ్యం ఉంది. కానీ సోలార్‌ ప్యానెల్‌లో ప్రాథమిక భాగమైన సోలార్‌ సెల్స్‌ తయారీ సామర్థ్యం 30 గిగావాట్లు మాత్రమే ఉంది. సోలార్‌ ప్యానెల్‌లో సౌరశక్తిని విద్యుత్తు శక్తిగా మార్చడంలో సోలార్‌ సెల్స్‌ కీలకం. ఇప్పటి వరకు వీటిని దిగుమతి చేసుకుని సోలార్‌ ప్యానెళ్లలో వినియోగిస్తుండేవారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం సోలార్‌ ప్యానెళ్ల లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత సమస్యకు ఇదే కారణమవుతోంది. ఒక్కసారిగా దేశీయ సోలార్‌ సెల్స్‌కు డిమాండ్‌ పెరగడంతో మే నెలలో వీటి ధరలు భారీగా పెరిగాయి. దిగుమతి చేసుకున్న సెల్స్‌తో పోలిస్తే దేశీయ సెల్స్‌తో తయారయ్యే ప్యానెళ్ల ధరలను సుమారు 80 నుంచి 120 శాతం పెంచేశారు.


ఇలాగైతే లక్ష్యం చేరుకునేదెలా?

ఇటీవలి కాలంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటూ వస్తోంది. ఇందులో సౌరశక్తి అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం దేశ మొత్తం విద్యుత్తు సామర్థ్యంలో సౌరశక్తి సామర్థ్యం సుమారు 30 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 15న పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకాన్ని ప్రారంభించింది. 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లను అమర్చడం ద్వారా 30 గిగావాట్ల సౌరశక్తిని దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యానికి జోడించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పీఎం సూర్యఘర్‌ పథకాన్ని వంద శాతం అమలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ.75 వేల కోట్లు ఆదా అవుతాయి. నిర్దేశిత లక్ష్యం కోటి ఇళ్లు కాగా ఇప్పటి వరకు 40 లక్షల ఇళ్లకు మాత్రమే పీఎం సూర్యఘర్‌ పథకం కింద సోలార్‌ ప్యానెళ్లను అమర్చారు. వీటి ద్వారా 12 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 2027 మార్చి నాటికి మరో 60 లక్షల ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానెళ్లను అమర్చాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో 2027 మార్చి నాటికి 20 లక్షల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లను అమర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల సోలార్‌ ప్యానెళ్లను ఉచితంగా ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. పీఎం సూర్యఘర్‌ కింద ఇప్పటి వరకు 10,32,671 దరఖాస్తులు రాగా కేవలం 1,71,055 ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేశారు. ఇంకా 8 లక్షల పైచిలుకు దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించి మరీ వెండర్ల వెంటబడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. కేంద్ర పెట్టిన నిబంధనతో ప్యానెళ్ల లభ్యత తగ్గిపోవడం, ధరలు పెరిగిపోవడం వెండర్లకు భారంగా మారింది.


ఫలితంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా అమర్చే రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. సూర్యఘర్‌ కింద దరఖాస్తు చేసుకున్నవారు నెలలు తరబడి వేచి ఉండలేక, సబ్సిడీని వదులుకునేందుకూ సిద్ధమై దిగుమతి చేసుకున్న ప్యానెళ్ల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. కేంద్ర నిబంధన కారణంగా సూర్యఘర్‌ అమలులో నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని చేరుకోలేమని వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఉద్దేశం మంచిదే అయినా దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని, డిమాండ్‌ను అంచనా వేయకుండా ఒక్కసారిగా నిబంధన అమలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలుకు నిర్దేశించిన సమయంలో తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.


పీఎం కుసుమ్‌పైనా ప్రభావం

రైతుల కోసం నిర్దేశించిన పీఎం కుసుమ్‌ పథకంపైనా కేంద్ర నిర్ణయం ప్రభావం చూపుతోంది. రైతులు తమ వద్ద ఉన్న నిరుపయోగ భూముల్లో చిన్న సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని సాగునీటి అవసరాల కోసం గ్రిడ్‌ కనెక్టెడ్‌ లేదా స్టాండ్‌ అలోన్‌ సోలార్‌ పంపును ఏర్పాటు చేసుకునేందుకు పీఎం కుసుమ్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు ఉచిత విద్యుత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు పీఎం కుసుమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ పథకంపైనా సోలార్‌ ప్యానెళ్ల కొరత ప్రభావం పడుతోంది.

సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై దృష్టి

విదేశాల నుంచి నాన్‌ డీసీఆర్‌ ప్యానెళ్లు దిగుమతి చేసుకుని వినియోగించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్య నిల్వలపై ప్రభావం పడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల ప్రభావం కారణంగా విదేశీ మారకద్రవ్య నిల్వలను వీలైనంత జాగ్రత్తగా వినియోగించుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. అందులో భాగంగా దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇక రెండోది.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాన్‌ డీసీఆర్‌ ప్యానెళ్లలోని సోలార్‌ సెల్స్‌లో ఇబ్బందులు తలెత్తితే వాటిని రీప్లేస్‌ చేయడం కష్టంగా మారుతోంది. ఫలితంగా ప్యానెళ్లు నిరుపయోగంగా మారుతున్నాయని, అదే దేశీయంగా తయారైన సోలార్‌ సెల్స్‌ వినియోగిస్తే వాటిని రీప్లేస్‌ చేసుకోవడం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన నిబంధన తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా సోలార్‌ సెల్స్‌ తయారీని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Updated Date - Jun 14 , 2026 | 04:17 AM