‘పీఎం రాహత్’తో రోడ్డు ప్రమాద మరణాలకు చెక్
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:12 AM
రోడ్డు ప్రమాదాల కట్టడికి ఆయా ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గురువారం...
గాయపడిన ఎవరికైనా రూ.1.5లక్షల ఉచిత వైద్యం
ఆపై ఎంతైనా ఎన్టీఆర్ ట్రస్టు భరిస్తుంది: మంత్రి సత్యకుమార్
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల కట్టడికి ఆయా ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గురువారం ‘పీఎం రాహత్’ పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ రిలీఫ్ ఇస్తుంది. ప్రమాదం జరిగిన గంటలోగా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని అందరికీ వర్తింపజేస్తాం. అర్హత కలిగిన వారిలో ఎవరికైనా రూ.1.5 లక్షల సరిపోకుంటే, మిగిలిన మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద భరిస్తాం. చిత్తూరు జిల్లాలో తాజాగా నమోదైన కేసుతో కలిపి ఇప్పటివ వరకూ ఈ పథకం కింద 56 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని కేంద్రం రూ.25 వేలకు పెంచింది. వీరికి పోలీసుల వైపు నుంచి ఎటువంటి సమస్యలూ ఉండవు. రాష్ట్రంలోని 656 ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయి’ అని తెలిపారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు సాధించాలి
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఏర్పాటుచేసిన డీసీజీ మానిటరింగ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ (ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకుల సాధన కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు కృషి చేయాలని ఆయన అన్నారు. క్రీడల అభివృద్ధి పనులకు ఆంధ్ర, కాకినాడ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ విష్ణువర్థన్‌లకు రూ.10 లక్షల చొప్పున చెక్‌లను మంత్రి అందించారు.
డిమాండ్ ఆధారంగా నర్సింగ్ కాలేజీలు
రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ఇకపై డిమాండ్ ఆధారంగానే నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు అనుమతిస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో నర్సింగ్ విద్యపై ఆయన సమీక్షించారు.