ఆగస్టు 1న ‘భోగాపురం’ ప్రారంభం
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:02 AM
ఉత్తరాంధ్ర మణిహారం.. భోగాపురంలో ప్రపంచస్థాయి అధునాతన సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు మోదీ శ్రీకారం
ఖరారైన ప్రధానమంత్రి షెడ్యూలు
చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమం
ఉత్తరాంధ్ర అన్‌స్టాపబుల్: చంద్రబాబు
అమరావతి/విజయనగరం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర మణిహారం.. భోగాపురంలో ప్రపంచస్థాయి అధునాతన సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో స్వయంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పలువురు మంత్రులతోపాటు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపట్టిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా జరగాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఎయిర్‌పోర్టుతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు వస్తాయన్నారు. పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్‌పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అన్‌స్టాపబుల్ ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని భావించామని చెప్పారు. అనంతరం, భారత విమానయాన సంస్థకు దరఖాస్తు చేసి.. విమానాశ్రయానికి అనువైన ప్రదేశంగా భోగాపురాన్ని గుర్తించామన్నారు. అప్పటి విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు సంబంధిత అనుమతులను సకాలంలో మంజూరు చేశారని గుర్తు చేశారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు సేకరిస్తున్న సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలిపారు. ఎర్రబస్సు కూడా వెళ్లని చోటుకు ఎయిర్‌బస్ ఎందుకంటూ ఎద్దేవా చేశారని గుర్తు చేశారు.
కూటమి అధికారంలో వచ్చాక రెండేళ్లలోనేభోగాపురం అందు బాటులోకి తెచ్చా మన్నారు. ఈ విమానాశ్రయం రాకతో అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెరుగుతుందని, రాష్ట్రం పారిశ్రామిక, వాణిజ్య కారిడార్‌గా మారుతుందని సీఎం పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం తరహాలోనే భోగాపురం విమానాశ్రయం కూడా రాష్ట్రాభివృద్ధిలోప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ విమాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ సైతం ఇదే విషయాన్ని తెలిపారు. శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘‘ఆగస్టు 1న ఉత్తరాంధ్ర.. ‘ఉత్తమాంధ్ర’గా నిలిచేందుకు ము హూర్తం ఆసన్నమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఓగొప్ప క్షణం ఆవిష్కృతం కానుంది.’’ అని పేర్కొన్నారు.