ఆరోగ్యం జాగ్రత్త
ABN , Publish Date - May 11 , 2026 | 04:11 AM
‘ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా ేసవలు అందించాల్సిన అవసరం ఉంది.
ప్రజలకు మరింత సేవ చేయాలి.. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
ఇంటికెళ్లి మోదీ పరామర్శ.. మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్
ఆయన రాక.. మాకు గొప్ప అనుభూతి: ఉప ముఖ్యమంత్రి
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ‘ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా ేసవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని.. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ ఇంటికి వెళ్లారు. ఆయన తన సతీమణి అన్నా, పిల్లలు అకీరా నందన్, ఆద్య, పోలినా అంజని, మార్క్ శంకర్‌తో కలిసి సాదరంగా మోదీకి స్వాగతం పలికారు. పవన్‌ను ప్రధాని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. పవన్ సతీమణి అన్నా కొణిదెలతో మోదీ మాట్లాడుతూ.. కొన్ని రష్యన్ పదాలు పలికారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థాంక్యూ కార్డులను మోదీకి అందించారు. మార్క్ శంకర్‌ను ప్రధాని దగ్గరకు తీసుకొని ‘సింగపూర్‌లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అని మేమంతా ఆందోళనపడ్డాం’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. పవన్ పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో మాట్లాడుతూ.. ఏం చేస్తున్నావని అడిగారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని, అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నానని అకీరా చెప్పాడు. పవన్ వైపు మోదీ చూస్తూ.. ‘ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు. నువ్వూ అటు వైపే వెళ్తున్నావా’ అని చమత్కరించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ కవితను అకీరా వినిపించగా, మోదీ అభినందించారు. పవన్ కుమార్తెలు ఆద్య, పలీనా అంజనితో ప్రధాని మాట్లాడుతూ.. వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాలు అక్కడ గడిపారు.
ఎప్పటికీ గుర్తుంచుకుంటా: పవన్
మోదీ వెళ్లిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ ఓ ప్రకటనలో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికే గొప్ప గౌరవం తనకు, తన కుటుంబ సభ్యులకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ తన నివాసానికి విచ్చేయడం గొప్ప అనుభూతి కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఆయన సహృదయంతో విచ్చేయడం, ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆయన చూపిన ఈ ఆదరణను ఎంతో విలువైనదిగా భావిస్తాను. ఏప్రిల్ 19న నా శస్త్ర చికిత్స జరిగిన వెంటనే ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నాకు హృదయపూర్వక భరోసా, మద్దతు అందించారు. ఇప్పుడు నేను కోలుకుంటున్న సమయంలో నా నివాసానికి రావడం నేను ఎప్పటికీ గుర్తుంచుకునే సందర్భం. ఆయన ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. తన ఆలోచనలు, చేతల్లో ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తారు. ఇదే ఆయన్ను నిజంగా విశిష్టమైన వ్యక్తిగా నిలుపుతుంది. దేశానికి నాయకత్వం వహించే అపారమైన బాధ్యతను మోస్తున్నప్పటికీ, ఆయన కరుణ, వ్యక్తిగత శ్రద్ధ, ప్రజలతో ఉన్న భావోద్వేగ అనుబంధ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన శ్రద్ధకు, సుహృద్భావంతో కూడిన మాటలకు, మాతో గడిపిన విలువైన సమయానికి ఎంతోగానో చలించిపోయాను. ఆయన అసాధారణ నాయకత్వం, దేశ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతకు మించి.. ఆయన వినయం, కరుణ, ప్రజలతో ఆయనకున్న వ్యక్తిగత అనుబంధం దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆయన ఆశీస్సులు, మార్గదర్శనం, ఆప్యాయమైన మద్దతు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఈ చిరస్మరణీయ పర్యటనకు, ఆయన నిరంతర మార్గదర్శనానికి, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పవన్ తెలిపారు.