Share News

రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో ‘డబుల్‌ ఇంజన్‌ స్పీడ్‌’

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:45 AM

‘డబుల్‌ ఇంజిన్‌ స్పీడ్‌’తో అభివృద్ధి అంటూ కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లే రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా మారుతున్నాయి.

రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో ‘డబుల్‌ ఇంజన్‌ స్పీడ్‌’

  • వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

  • స్టేషన్లలో శిలా ఫలకాలు ఆవిష్కరించిన నేతలు

  • ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు: పెమ్మసాని

  • స్వాతంత్య్రం తర్వాత ఇదే పెద్ద రైల్వే విప్లవం: లోకేశ్‌

మంగళగిరి సిటీ/విజయవాడ/కంభం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘డబుల్‌ ఇంజిన్‌ స్పీడ్‌’తో అభివృద్ధి అంటూ కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లే రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా మారుతున్నాయి. అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకంలో భాగంగా రాష్ట్రంలో మంగళగిరి, రాయనపాడు, కంభం స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్లను ప్రధాని మోదీ శుక్రవారం పంజాబ్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. స్థానికంగా పలువురు నేతలు, రైల్వే అధికారులు స్టేషన్ల వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 12.56 కోట్ల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దిన మంగళగిరి రైల్వే స్టేషన్‌లో రాష్ట్ర మంత్రి లోకేశ్‌తో కలసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానిక సంప్రదాయాలు, కళలు, చేనేత సంస్కృతిని ప్రతిబింబించేలా స్టేషన్‌ను తీర్చిదిద్దారని పెమ్మసాని తెలిపారు. 2014కు ముందు సుమారు రూ.900 కోట్ల రైల్వే బడ్జెట్‌ మాత్రమే ఉండేదని, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నారని తెలిపారు. దేశాన్ని కలిపేది రైల్వే వ్యవస్థ అని లోకేశ్‌ చెప్పారు. వందే భారత్‌, బుల్లెట్‌ రైళ్లు, కవచ్‌ భద్రతా సాంకేతికత, వంద శాతం విద్యుదీకరణ, ఆధునిక సరుకు రవాణా కారిడార్లు, ఆధునికీకరించిన రైల్వే ేస్టషన్లు, హైడ్రోజన్‌ ఆధారిత రైళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో జరుగుతున్న అతిపెద్ద మార్పు అని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఇదొక అతి పెద్ద రైల్వే విప్లవమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ సుధేష్ణ ేసన్‌ పాల్గొన్నారు.


ఎయిర్‌పోర్టులా రాయనపాడు

ఎయిర్‌పోర్టును తలపించేలా తీర్చిదిద్దిన రాయనపాడు రైల్వే స్టేషన్‌ అత్యాఽధునిక సదుపాయాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ జంక్షన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు రూ. 35 కోట్లతో శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌గా దీనిని అభివృద్ధి చేశారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా 1893-1896ల మధ్య విజయవాడ పరిసరాల్లో రైల్వేలైన్ల విస్తరణ కోసం రాయనపాడులో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోకి వచ్చిన తర్వాత విజయవాడ డివిజన్‌ పరిధిలో దీని నిర్వహణ ఉండేది. గూడ్స్‌, కొన్ని పాసింజర్‌ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగేవి. శాటిలైట్‌ స్టేషన్‌గా ప్రకటించిన తర్వాత అభివృద్ధి మొదలైంది. కాజీపేట - విజయవాడ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు ఇక్కడ ఇప్పుడు స్టాప్‌ ఉంది. ఎన్టీఆర్‌ జిల్లా విశిష్ఠతైన కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్‌తో స్టేషన్‌ భవనం ఽధగధగలాడుతోంది. ఆధునిక వెయిటింగ్‌ హాల్‌, రూ. 5.77 కోట్ల వ్యయంతో ఆధునిక మాడ్యులర్‌ టాయిలెట్స్‌, ఏసీ ప్రీపెయిడ్‌ వెయిటింగ్‌ హాల్‌, దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, రూ. 13.33 కోట్ల వ్యయంతో ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ, రూ. 6.38 కోట్ల వ్యయంతో కొత్త ప్లాట్‌ఫామ్‌ షెల్టర్స్‌, రూ. 5.77 కోట్ల వ్యయంతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ), లిఫ్ట్‌లు, ఆధునిక లైటింగ్‌ కళాకృతులు, ర్యాంపులు, దివ్యాంగుల కోసం టాక్టైల్‌ టైల్స్‌, పాత్‌వేలు, ల్యాండ్‌ స్కేపింగ్‌, లేన్‌ మార్కింగ్‌, వీధి దీపాలు వంటి మరెన్నో పనులు చేపట్టారు. ప్రధానమంత్రి వర్చువల్‌ ప్రారంభం తర్వాత.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) స్థానికంగా పలు విభాగాలను ప్రారంభించారు.


ఆధునిక హంగులతో.. కంభం మారింది

మార్కాపురం జిల్లాలోని కంభం రైల్వేస్టేషన్‌ దశాబ్దాల నుంచి పలు సమస్యలతో కునారిల్లుతూ ఉండేది. ఏడాది కిందట ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన అమృత్‌భారత్‌ పథకంలో ఈ రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. దీంతో ఆధునీకరణకు రూ. 11.76 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. పనులన్నీ వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కంభం రైల్వే స్టేషన్‌ అన్నిహంగులతో సిద్ధమైంది. ఈ స్టేషన్‌ను చూసిన ప్రయాణికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెబుతున్నారు. స్థానికంగా రైల్వే జీఎం సురేశ్‌, డీసీఎం వినయ్‌కాంత్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 04:48 AM