Share News

నేడు బాబు, పవన్‌ నివాసాలకు మోదీ

ABN , Publish Date - May 10 , 2026 | 04:56 AM

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాసాలకు వెళ్లనున్నారు.

నేడు బాబు, పవన్‌ నివాసాలకు మోదీ

  • సీఎంతో సమావేశం కానున్న ప్రధాని

హైదరాబాద్‌, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాసాలకు వెళ్లనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో అధికారిక కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. అనంతరం హైటెక్‌సిటీలో సింధు ఆస్పత్రిని ప్రారంభించిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి సాయంత్రం 4.40 గంటలకు చేరుకుంటారు. ఈ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ కానుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తిని పెంచింది. బీజేపీ-టీడీపీల మధ్య బంధానికి ఇది తార్కాణంగా నిలుస్తుందని రెండు పార్టీల నేతలు అంటున్నారు. తెలంగాణలో.. ప్రత్యేకించి ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ పెద్దసంఖ్యలో అభిమానులున్నారు. 2029 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. తెలుగుదేశం అభిమానులకు ఒక సానుకూల సంకేతం పంపించేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. బీజేపీ, టీడీపీ పొత్తు సంగతి ఎలా ఉన్నా చంద్రబాబుతో ప్రధాని మోదీ భేటీ వ్యూహాత్మకమేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబుతో తమ పార్టీ సాన్నిహిత్యాన్ని సుదీర్ఘ కాలం కొనసాగించాలనుకునేలా మోదీ సంకేతం ఇచ్చినట్లుగా భావించవచ్చని బీజేపీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కొనసాగుతుందా లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ‘గతరెండు దశాబ్దాలుగా ఇక్కడ అధికారంలో లేకున్నా, పూర్వపు జీహెచ్‌ఎంసీ పరిధిలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ తదితర నియోజకవర్గాల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉంది. ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించగలవు’ అని అభిప్రాయపడ్డారు.


పవన్‌ను పరామర్శించనున్న ప్రధాని..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ప్రఽధాని పరామర్శించనున్నారు. చంద్రబాబు నివాసం నుంచి ప్రధాని నేరుగా మాదాపూర్‌లోని పవన్‌ నివాసానికి వెళ్లనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా పవన్‌ ఇంటికి వెళ్తారని భావిస్తున్నారు. మోదీ రాష్ట్రాల పర్యటనలో నేతల ఇళ్లకు వెళ్లటం అరుదని, తొలిసారి అలా వెళ్తున్నారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ‘కార్యక్రమాలు ఉంటే వాటికి నేరుగా హాజరై ఢిల్లీకి తిరిగివెళ్లడం మాత్రమే ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో ఉంటాయి. ఈసారి అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కల్యాణ్‌ల నివాసాలకు వెళుతున్నారు’ అని అంటున్నారు.

ట్రాఫిక్‌లో బాబు కాన్వాయ్‌

సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ శనివారం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ప్రధాని పర్యటన కోసం కేంద్ర బలగాలతో కలిసి తెలంగాణ పోలీసులు రూట్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. దీంతో బంజారాహిల్స్‌లో భారీగా ట్రాఫిక్‌ నిలిచింది. చంద్రబాబు బంజారాహిల్స్‌లోని నివాసానికి వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీంతో చంద్రబాబు కారు దిగగా, గమనించిన పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.

Updated Date - May 10 , 2026 | 04:58 AM