Share News

‘భోగాపురం’తో నవశకం

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:20 AM

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

‘భోగాపురం’తో నవశకం

  • ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరగాలి.. మరో రూ.18 వేలకోట్ల ప్రాజెక్టులకూ శంకుస్థాపన

  • ప్రధాని మోదీకి 13,500 మంది థింసా నృత్యంతో స్వాగతం

  • అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో నూతన శకం ప్రారంభమవుతుందని అన్నారు. ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలతో పాటు ఉపాధి, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు తెలుగుజాతికి గర్వకారణంగా మారనున్న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధానికి గిరిజన సంప్రదాయ నృత్యం థింసా, కూచిపూడి నృత్యంతో స్వాగతం పలకాలని అధికారులకు సూచించారు. గిన్నిస్‌ రికార్డు సృష్టించేలా ఎక్కువ మందితో థింసా నృత్య ప్రదర్శన ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు థీమ్‌తో విమానాశ్రయం గురించి ప్రతి ఇంటా చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని అన్నారు. మహిళలు, యువత, పాఠశాలల విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు చేరువయ్యేలా వేర్వేరు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఫ్లాష్‌మాబ్‌లు, డ్రోన్‌షోలు నిర్వహించాలని కోరారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. 3కే, 5కే రన్‌ లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి కూడా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం టెర్మినల్‌ భవనం ప్రారంభించిన తర్వాత ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన రూ.18 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు.


ప్రధాని కార్యక్రమం ఇదీ..

ఆగస్టు 1న ఉదయం 10.45కు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీ ర్‌, సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. 10.58 గంటలకు విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం టెర్మినల్‌ భవనాన్ని పరిశీలిస్తారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డులో స్థానం దక్కేలా ప్రధానికి 13,500 మందికిపైగా గిరిజన మహిళలతో థింసా నృత్యంతో స్వాగతం పలుకుతారు. 11.30 నుంచి 12.55 వరకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళతారు.

Updated Date - Jul 28 , 2026 | 05:22 AM