‘భోగాపురం’లో ప్రధాని 2 గంటల పర్యటన
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:19 AM
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుమారు..
1న విమానాశ్రయం ప్రారంభోత్సవం,
బహిరంగ సభకు మోదీ హాజరు
షెడ్యూల్ ఖరారు.. మంత్రుల సమీక్ష
భోగాపురం/విజయనగరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుమారు 2గంటలకుపైగానే ఇక్కడ పర్యటించనున్నారు. ఆగస్టు 1, శనివారం ఉదయం 10.45 నుంచి మఽధ్యాహ్నం 1.05 వరకు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం 10.45కు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం, భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనానికి ప్రధాని చేరుకుంటారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని పీఎం పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలా ఫలకం ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇలా మొత్తం 2గంటలకుపైగా ప్రధాని భోగాపురం పర్యటనలో పాల్గొంటారు. ఇదిలావుంటే, విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్థనరెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి సమీక్షించారు. విమానాశ్రయం ప్రారంభం అనంతరం నిర్వహించే సభ విషయంలో కచ్చితమైన ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రధానికి స్వాగత ఏర్పాట్లు, కార్యాచరణ, రక్షణ చర్యలు, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాహనాల రద్దీ, వాహనాల మళ్లింపు, భోజనం, వసతులు, వీవీఐపీ, వీఐపీ పాసుల జారీ తదితర అంశాలతో పాటు భారీ జన సమీకరణపై చర్చించారు. బాలికల థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకాలని సూచించారు.