తోడ్పాటునివ్వండి!
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:27 AM
నీట్ పేపర్ లీక్ వివాదం... ‘కాక్రోచ్’ ఆందోళనలు... పార్లమెంటులో, బయటా విపక్షాల నిరసనల వేడి.... ఇవన్నీ ఎలా ఉన్నా సరే! ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కీలక బిల్లులు గట్టెక్కాలి
‘నీట్’ ఆందోళనలు సమసిపోతాయి
మహిళా కోటా, డీలిమిటేషన్ ముఖ్యం
రాజ్యసభలో బలానికి ఢోకా లేదు
లోక్‌సభలో మరింత మద్దతు కావాలి
పలు పార్టీలతో చర్చలు జరుపుతున్నాం
చంద్రబాబుతో భేటీలో ప్రధాని వెల్లడి!
ఆగస్టు 10లోగా రాజ్యాంగ సవరణకు ఆమోదం!
‘భోగాపురం’ ప్రారంభానికి మోదీకి ఆహ్వానం
న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ లీక్ వివాదం... ‘కాక్రోచ్’ ఆందోళనలు... పార్లమెంటులో, బయటా విపక్షాల నిరసనల వేడి.... ఇవన్నీ ఎలా ఉన్నా సరే! ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్ విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు గట్టెక్కేలా వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని కీలక చర్చలు జరిపారు. ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సిందిగా చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించారు. ఇదే సమయంలో కీలక బిల్లుల ఆమోదంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై దాదాపు 40 నిమిషాలు ముఖాముఖి చర్చలు జరిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ‘‘కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, ప్రతిపక్షాల నిరసనలు త్వరలో సద్దుమణుగుతాయి. అది పెద్ద రాజకీయ సమస్య కాదు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. వచ్చేవారం పార్లమెంటులో కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందుతాయి. ఆ తర్వాతి వారంలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి... మహిళలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రిజర్వేషన్‌ను అమలు చేయాలని భావిస్తున్నాం’’ అని మోదీ చెప్పినట్లు తెలిసింది.
ఆగస్టు 1లోపే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాజ్యసభలో బిల్లు ఆమోదానికి ఢోకా లేదని, లోక్‌సభలో కొంత సంఖ్యాబలం అవసరమని ప్రధాని చెప్పినట్లు సమాచారం. ఎన్‌సీపీ, డీఎంకేతో పాటు పలుపార్టీల నేతలతో సంప్రదిస్తున్నామంటూ... ‘మీరు కూడా దీనికి తోడ్పడాలి’ అని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. తొలుత చంద్రబాబు, కేంద్రమంత్రి భూపతి వర్మ, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీపీ నేత లావు కృష్ణదేవరాయ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మోదీని కలుసుకున్నారు. కలిశెట్టిని చంద్రబాబు పరిచయం చేయబోగా... ‘ఆయనెందుకు తెలియదు, రోజూ పార్లమెంట్‌కు సైకిల్‌పై వస్తారు కదా! ఆయన క్రమశిక్షణే వేరు’ అని ప్రధాని ప్రశంసించారు.