PM Modi: ప్రకృతి సమతుల్యతే పొంగల్!
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:16 AM
ప్రకృతిని సమతుల్యం చేయడమే పొంగల్ ఇస్తున్న సందేశమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దీనిని ప్రపంచస్థాయి పండుగగా అభివర్ణించారు. పురాతన నాగరికతకు చిహ్నమని తెలిపారు.
ఇది.. ప్రపంచస్థాయి పండుగ
పురాతన నాగరికతకు చిహ్నం
ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటన
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న పీఎం
వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ, జనవరి 14: ప్రకృతిని సమతుల్యం చేయడమే పొంగల్ ఇస్తున్న సందేశమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దీనిని ప్రపంచస్థాయి పండుగగా అభివర్ణించారు. పురాతన నాగరికతకు చిహ్నమని తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తమిళులు సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునే ఉత్సవమని పేర్కొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో బుధవారం పొంగల్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని దాదాపు తమిళ సంప్రదాయాన్ని పాటించారు. ఈ వేడుకలకు తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఇటీవల విడుదలైన తమిళ మూవీ ‘పరాశక్తి’ బృందం కూడా హాజరైంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే కొద్ది మాసాల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ పండుగ రైతు కష్టాన్ని, భూమికి-భానుడికి కృతజ్ఞతను తెలియజేస్తుందని అన్నారు.
కృతజ్ఞత కేవలం మాటలకే పరిమితం కాకుండా దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాలని ఈ పండుగ చెబుతుందన్నారు. పుడమి మనకు ఎన్నో ఇస్తోందని.. దానిని పరిరక్షించుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తు తరాల కోసం వనరులను తెలివిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ సమాజం పొంగల్‌ను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటుందని.. వారితో కలిసి తాను ఈ వేడుక నిర్వహించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. జీవించి ఉన్న పురాతన నాగరికతకు తమిళ సంస్కృతి నిదర్శనమని కొనియాడారు. కాగా.. ‘వణక్కం’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పొంగల్‌ను నేడు ప్రపంచ వేడుకగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా.. ఈ వేడుకల్లో ‘పరాశక్తి’ సినిమా బృందం సందడి చేసింది.
ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగలు
ఈ సందర్భగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ‘సంక్రాంతి, పొంగల్ రైతులకు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగలు. దేశ వ్యవసాయ సంప్రదాయాలను, సాంస్కృతిక ఏకత్వాన్ని, ఘనమైన వారసత్వాన్ని గౌరవించే సందర్భాలు’ అని పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, సంక్రాంతి, పొంగల్ దేశ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీక అని పేర్కొన్నారు.