మనసున్న మారాజులు ఆదుకోరూ..!
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:42 PM
అతడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చిదిమేస్తున్న రోగం
రెండు కిడ్నీలు ఫెయిల్
కదలలేని పరిస్థితి
ఆపరేషన కోసం రూ.10లక్షలు
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
అతడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు. కోటి ఆశలతో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అంతలోనే విధి వక్రీకరించింది. ఉన్నట్టుండి అతడి ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఆ యువకుడి జీవితంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో కదలలేని స్థితి చేరుకున్నాడు. తండ్రి లేడు. తల్లి చిన్నపాటి ఉద్యోగం. ఆ ఇంటికి పెద్ద దిక్కు అతడే. అచేతనావస్థకు చేరిన ధనుష్‌కు ఆపరేషన చేయించాలంటే రూ.10లక్షలకు పైగా ఖర్చు అవుతోంది. అంతా స్థోమత లేక ఒకరికి సాయం అడగలేక ఆ తల్లి మదనపడుతోంది. మనసున్న మారాజులు ఎవరైనా ఆదుకుంటోరేమోనని ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. ధనుష్ కన్నీటి గాథపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
కోడుమూరు రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన కామార్తి శ్రీనివాసులు, పద్మావతి దంపతులకు కొడుకు ధనుష్, కూతురు సుశీల సంతానం. శ్రీనివాసులు ఆర్‌ఎంపీ వైద్యుడు కాగా, పద్మావతి అంగనవాడీ ఆయాగా పని చేస్తున్నా రు. ఆదంపతులకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఇల్లు కూడా లేదు. అరకొర సంపాదనతో కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చదివించారు. 2022లో ధనుష్ తండ్రి హార్ట్ అటాక్‌తో మృతిచెందాడు. కుటుంబ భారమంతా తల్లి పద్మావతిపై పడింది. కూతురికి పెళ్లి చేశారు. భర్త వైద్య ఖర్చులు, కుమార్తె వివాహానికి మొత్తం రూ.15లక్షలు అప్పు అయ్యింది.
చదువుపై అమితాస్తకి
చిన్నప్పటి నుంచి ధనుష్‌కు చదువుపై అమితాసక్తి. ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు. 8వ తరగతిలో ధనుష్‌కు కాళ్లవాపు చెందడంతో తల్లిదండ్రులు కర్నూలు ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాదుకు వెళ్లమని సూచించడంతో అక్కడ కిమ్స్‌లో వైద్య పరీక్షలు జరిపించారు. కిడ్నీ బయాప్సీ చేయించి ఇనఫెక్షన సోకినట్లు గుర్తించారు. యూరినలో ప్రొటీన్స నష్టపోతున్నట్లు నిర్ధారించి మందులు సూచించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా మాత్రలు తీసుకుంటున్నాడు. ఓ పక్క ధనుష్‌కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ట్యాబ్లెట్ల సాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే పదిలో 8.0 గ్రేడు, ఇంటర్ ఎంపీసీలో 930 మార్కులు సాధించాడు.
బీటెక్ పూర్తి చేశాడు
ఎంసెట్‌లో ర్యాంకు సాధించి బీటెక్ పూర్తిచేశాడు. తండ్రి దూరమైన ఏడాదే 2022లో ధనుష్‌కు హైదరాబాదు టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. ఏడాదికి రూ.4లక్షలు వేతనం. తండ్రి దూరమైన దుఃఖాన్ని భరిస్తూనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. తన మాత్రలకు నెలకు రూ.6వేలు ఖర్చు భరిస్తూ, వసతి, తిండి తిప్పలు పడుతూ అప్పులు తీర్చ సాగాడు.
కిడ్నీ మార్పిడి అవసరమని సూచించడంతో..
ధనుష్ గత నెలలో ఓరోజు రూంలో కళ్లు తిరిగిపడిపోయాడు. ఆందోళన చెందిన స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్న వైద్యులు పరీక్షలు జరిపారు. రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమ్యాటిసిస్)తో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. వైద్య పరీక్షల్లో బ్లడ్‌లో క్రియాటిన 16 ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఇది 0-1 మధ్యలో ఉండాలని, అత్యంత ప్రమాదకరస్థాయికి చేరినట్లు బాంబు పేల్చారు. తక్షణమే డయాలసిస్ చేయాలని, కిడ్నీ మార్పిడి అవసరమని సూచించడంతో 20 రోజుల క్రితం ధనుష్ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికి విచ్చేశాడు. ఆపరేషన, మెడికల్ ఖర్చులు వెరసి రూ.15లక్షల పైగా ఖర్చు అవుతోందని ధనుష్ అవేదన చెందాడు. అతడికి రెండు రోజుల క్రితమే డయాలసిస్ జరిగింది.
తల్లడిల్లుతున్న తల్లి
ఒక్కగానొక్క కొడుకు అచేతనావస్థలో ఉండడంతో తల్లి పద్మావతి తల్లడిల్లుతోంది. ఉదయం సపర్యలు చేసి అంగనవాడీ కేంద్రానికి వెళ్తుంది. కొడుకును బతికించు కోవడానికి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఆపరేషన చేయించడానికి ఆర్థిక స్థాయి లేకపోవడంతో ఆపన్నహస్తం కోరుతోంది. చాలీచాలని జీతంతో ఇంటిబాడుగ, కుటుంబ ఖర్చులకు దినదినగండంగా మారిందని, రూ.లక్షలు ఎలా సమకూర్చేదని కన్నీరు కార్చింది. దాతలు, ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే కొడుకును బతికించుకుంటానని వేడుకుంటోంది. దాతలు ఎవరైనా సాయం అందించాలనుకుంటే సెల్ నెంబరు: 70136 78765, 82473 07762కు సంప్రదించాలని కోరుతోంది.