Share News

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేలా ఆదేశించండి

ABN , Publish Date - Feb 27 , 2026 | 05:01 AM

రాష్ట్రంలోని 13,325 గ్రామపంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం...

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేలా ఆదేశించండి

  • హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు

  • రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీకి నోటీసులు

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 13,325 గ్రామపంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయవాది తాండవ యోగేష్‌ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పార్టీ ఇన్‌ పర్సన్‌గా ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు. ‘రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ఏప్రిల్‌ 2, పట్టణ స్థానిక సంస్థలకు మార్చి 17తో కాలపరిమితి ముగియనుంది. రాజ్యాంగంలోని అధికరణ 243ఇ(3), 243యు(3) ప్రకారం కాలపరిమితి ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది’ అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ జనాభా లెక్కింపునకు డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. 2023లో కమిషన్‌ ఏర్పాటైనప్పటికీ నివేదిక సమర్పించలేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరించింది. బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మరో పిల్‌ దాఖలైంది’ అని వివరించారు. అన్ని వివరాలు జత చేసి కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Feb 27 , 2026 | 05:02 AM