Macharla Police: మరోమారు పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:22 AM
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని మరోమారు మాచర్ల రూరల్ పోలీసులు విచారించనున్నారు.
జంట హత్యల కేసులో మూడు రోజులు విచారించనున్న మాచర్ల రూరల్ పోలీసులు
మాచర్ల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని మరోమారు మాచర్ల రూరల్ పోలీసులు విచారించనున్నారు. వారిని మూడు రోజులపాటు విచారించేందుకు మాచర్ల కోర్టు అనుమతించింది. పిన్నెల్లి సోదరులను తమ కస్టడీకి ఇవ్వాలని మాచర్ల రూరల్ పోలీసులు కోరగా న్యాయాధికారి శ్రీనివాస్ కల్యాణ్ సోమవారం వర్చువల్‌గా విచారణ జరిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో పిన్నెల్లి సోదరులను విచారించేందుకు అనుమతించారు. ప్రభుత్వం తరుపున ఏపీపీ విజయ్‌కుమార్ వాధించగా పిన్నెల్లి సోదరుల తరుపున బార్రెడ్డి నాగిరెడ్డి, గుంజె వరప్రసాద్ తమ వాదనలు వినిపించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గతేడాది మే నెల 24వ తేదీన జరిగిన టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జెవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గతేడాది డిసెంబరు 29, 30 తేదీల్లో మాచర్ల రూరల్ పోలీసులు పిన్నెల్లి సోదరులను తొలిసారి కస్టడీకి తీసుకొని విచారించారు.