AP High Court: దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కోసం పిల్
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:08 AM
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
ప్రతివాదులకు నోటీసులు.. కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని విభిన్న, స్త్రీ, శిశు, ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ కార్యదర్శి పరమానంద్ ద్వివేది ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా, అంధుడైన సీనియర్ న్యాయవాది ఎస్‌కే రుంగ్తా వాదనలు వినిపించారు. ప్రభుత్వ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించకపోవడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఖాళీల ఆధారిత రోస్టర్‌ను సిద్ధం చేయాలని కోరారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్న దివ్యాంగుల కేటగిరీ బ్యాక్‌లాగ్ పోస్టుల ఖాళీలను లెక్కించి నిర్ణీత కాలవ్యవధిలో వాటిని భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ)ఎ్‌స.ప్రణతి స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నాలుగుశాతం రిజర్వేషన్ అమలు చేస్తోందన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మరో పిల్ కూడా దాఖలైందని, అందులో సవివరంగా కౌంటర్ వేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.