100 కాదు 50..!
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:41 AM
ఈ ఏడాది నీట్ అడ్మిషన్లలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లకే పరిమితం కానుంది. మూడు వారాల క్రితం ఈ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ..
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో 50 సీట్లకే అడ్మిషన్లు
రెండోసారి తనిఖీల్లోనూ మౌలిక వసతులపై ఎన్‌ఎంసీ అసంతృప్తి
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నీట్ అడ్మిషన్లలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లకే పరిమితం కానుంది. మూడు వారాల క్రితం ఈ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) ఇచ్చిన ఎన్‌ఎంసీ... ఆ తర్వాత వాటిని 50కి కుదించింది. ఈ కాలేజీలో కొన్ని మౌలిక వసతుల లేమి కారణంగా 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులివ్వడం కష్టమని యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఓపీ, ఐపీ, వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే అదనపు సీట్లకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. అయితే సీట్ల తగ్గింపుపై డీఎంఈ అధికారులు రెండు వారాల క్రితం ఎన్‌ఎంసీని సంప్రదించారు. పిడుగురాళ్లల్లో మరోసారి తనిఖీలు నిర్వహించాలని కోరారు. డీఎంఈ విన్నపం మేరకు ఎన్‌ఎంసీ రెండోసారి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో వర్చువల్‌గా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన మౌలిక వసతులపై ఎన్‌ఎంసీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కనీస మౌలిక సదుపాయాలు లేవు: పిడుగురాళ్లల్లో కనీసం మౌలిక సదుపాయాలు ఎన్‌ఎంసీ ఆశించిన స్థాయిలో లేవు. 420 పడకల ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ (ఓపీ) 400కి పైగా ఉన్నప్పటికీ.. ఇన్‌పేషెంట్ (ఐపీ) మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. రోజువారీగా కనీసం 30 మంది కూడా ఆస్పత్రిలో చేరడం లేదు. దీంతో పాటు రక్తపరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేయలేదు. వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి రాలేదు. సి.టి. స్కాన్ మిషన్ అందుబాటులో ఉన్నా స్కానింగ్‌లు ప్రారంభం కాలేదు. వైద్య సిబ్బంది కొరత కూడా ఉంది. కరెంటు సమస్య కారణంగా ల్యాబ్‌లు, సి.టి. స్కాన్ మిషన్ పనిచేయడం లేదు. మరోవైపు కొన్ని భవనాలు, ముఖ్యంగా విద్యార్థుల హాస్టల్స్ పూర్తికాలేదు. సెంట్రల్ ఏసీతో పాటు అనేక సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ సీట్ల సంఖ్యను తగ్గించింది. ఎన్‌ఎంసీ అభ్యంతరం వ్యక్తంచేసిన పనులు మొత్తం త్వరితగతిన పూర్తిచేస్తే తప్ప ఇక్కడ సీట్లు పెరిగే అవకాశం లేదు. మరోవైపు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంట్రాక్ట్ సంస్థకు, ఆరోగ్యశాఖ అధికారులకు మధ్య సమన్వయం లేదు.