ఫార్మాపై ‘యుద్ధ’ భారం
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:59 AM
రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల తయారీలో ఉపయోగించే సాల్వెంట్ల (పెట్రోలియం ఉప ఉత్పత్తులు) ధరలను ట్రేడర్లు 300 నుంచి 500 శాతానికి పెంచేశారు.
భారీగా పెరిగిన సాల్వెంట్ల ధర
300 నుంచి 500 శాతానికి పెరుగుదల
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల తయారీలో ఉపయోగించే సాల్వెంట్ల (పెట్రోలియం ఉప ఉత్పత్తులు) ధరలను ట్రేడర్లు 300 నుంచి 500 శాతానికి పెంచేశారు. దీంతో చాలామంది ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్‌పీజీ, డీజిల్ ధరల ప్రభావం కూడా పడడంతో ఫార్మా కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి మాత్రం తగ్గించుకుంటున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగుల సంఖ్యనూ తగ్గించుకోవలసి వస్తుందని చెబుతున్నాయి. ఉత్తరాంధ్రాలో 300 వరకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. విశాఖపట్నం సమీపాన జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ (రాంకీ), అచ్యుతాపురం సెజ్‌తో పాటు భీమిలి, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ప్రాంతాల్లోని పరిశ్రమలు పెద్దఎత్తున మందులు తయారు చేస్తున్నాయి. అత్యధికం యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియంట్స్ (ఏపీఐ) తయారుచేసి 75 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఏపీఐ మందుల తయారీకి వినియోగించే ముడి పదార్థం. ఏపీఐ తయారీకి టోలిన్, మిథనాల్, ఎసిటోన్ వంటి 20 రకాల సాల్వెంట్లను వినియోగిస్తారు. ఇవి పెట్రోలియం నుంచి ఉప ఉత్పత్తులుగా వస్తాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల పెట్రో ఉత్పత్తుల సరఫరా తగ్గడంతో సాల్వెంట్ల ధరలను స్థానిక ట్రేడర్లు పెంచేశారు. సాల్వెంట్లను విశాఖ, కాకినాడ, చెన్నై, ముంబై పోర్టులకు దిగుమతి చేసుకొని, 20-50 టన్నుల చొప్పున ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తారు. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇక్కడి ట్రేడర్లు సాల్వెంట్ల ధరలను 300 నుంచి 500 శాతం పెంచేశారు. ఐపీఏ ధర యుద్ధానికి ముందు కిలో రూ.60 ఉండగా, ఇప్పుడు రూ.274 చొప్పున విక్రయిస్తున్నారు. మిథనాల్ కిలో రూ. 28 ఉండగా, రూ.91కి అమ్ముతున్నారు. ధరలు పెంచడమే కాకుండా వాటిని బ్లాక్ చేసి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఒక్క రాంకీ ఫార్మాసిటీలోనే 25 కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయి.
ప్రయోజనాలన్నీ ట్రేడర్లకే..
సాల్వెంట్ల ధరలు పెరిగాయని ఏపీఐ ధరలు పెంచితే మార్కెట్‌లో కొనేవారు లేరు. ఎగుమతులకు కూడా ఆటంకాలు ఏర్పడడంతో ఫార్మా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టెల్‌మిసరటాన్ అనే ఏపీఐని రక్తపోటు తగ్గించే మందుల తయారీలో వినియోగిస్తారు. దీని తయారీకి మెటీరియల్ కాస్ట్(ఆర్‌ఎంసీ) ఇంతకు ముందు కిలోకి రూ.3 వేలు అయ్యేది. ఇప్పుడున్న సాల్వెంట్ల రేటుతో రూ.5,600కు పెరిగింది. సాల్వెంట్ల ధరలను పెంచేయడంతో ఫార్మా కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆదుకోవాలని కోరాయి. దాంతో దిగుమతి చేసుకునే సాల్వెంట్లకు మూడు నెలలకస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు ఫార్మా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఆ ప్రయోజనాన్ని కూడా ట్రేడర్లే పొందుతూ ఒక్క రూపాయి కూడా ధర తగ్గించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వమే నియంత్రణలోకి తీసుకోవాలి
దిగుమతి చేసుకునే సాల్వెంట్లను బ్లాక్ చేసి అందరికీ వాటిని అందకుండా చేస్తున్నారు. అందుకని వాటిని ప్రభుత్వమే నియంత్రణలోకి తీసుకొని అవసరమైన వారికి సమానంగా పంపిణీ చేయాలని కోరుతున్నాం. దానివల్ల ఏపీఐ ఉత్పత్తులు కొనసాగించే అవకాశం లభిస్తుంది.
- జెట్టి సుబ్బారావు, సెక్రటరీ, జేఎన్‌పీసీ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్