Share News

పెట్రో వర్సిటీలో ఇష్టారాజ్యం!

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:23 AM

రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వంగలిలో 2016లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటైంది. ప్రస్తుత వర్సిటీ ఉన్నతాధికారి ...

పెట్రో వర్సిటీలో ఇష్టారాజ్యం!

  • తెలుగు ఉద్యోగులే ఉన్నతాధికారి టార్గెట్‌!!

  • వారిని లక్ష్యంగా చేసుకుని బయటకు పంపిస్తున్న వైనం

  • ఇతర రాష్ట్రాల వారికే పోస్టింగులు, పదోన్నతులు

  • అడ్డగోలుగా నియామకాలు కూడా

  • గతంలో ఐఐపీఈ తరలింపునకూ యత్నాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వంగలిలో 2016లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటైంది. ప్రస్తుత వర్సిటీ ఉన్నతాధికారి విధుల్లో చేరి నాలుగేళ్లు కావస్తోంది. ఈ నాలుగేళ్లలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. దీనికి ఉదాహరణ.. బీవోజీ (బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌) చైర్మన్‌ నియామకం. చైర్మన్‌ పదవీకాలం కొన్నాళ్ల కిందట ముగిసింది. కొత్త చైర్మన్‌ ఎంపిక కోసం నోటిఫికేషన్‌ ఇచ్చినట్లే ఇచ్చి ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేశారు. తర్వాత వర్సిటీ ఉన్నతాధికారే ఇన్‌చార్జి బీవోజీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అర్హులైన వారెవరూ రాకపోవడంతో తానే ఆ పదవి స్వీకరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. సుమారు రెండున్నరేళ్లపాటు ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం గతంలో బీవోజీ చైర్మన్‌గా చేసిన వ్యక్తికే మళ్లీ అవకాశం కల్పించారు. గత బీవోజీ చైర్మన్‌ పనితీరు మెరుగ్గా ఉందని భావిస్తే.. పదవీకాలం ముగిసిన వెంటనే రెన్యువల్‌ చేయాలి. అలా కాకుండా రెండున్నరేళ్లపాటు ఈయన ఇన్‌చార్జిగా వ్యవహరించి.. తర్వాత తీరిగ్గా అవకాశం కల్పించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కీలక మంత్రాంగం నడచినట్లు చెబుతున్నారు. సదరు ఉన్నతాధికారి పదవీకాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. మరోసారి తాను అవకాశం దక్కించుకునే ఉద్దేశంతోనే బీవోజీ చైర్మన్‌ పదవిని మళ్లీ పాత వ్యక్తికి కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.


తెలుగువారికి తీవ్ర వేధింపులు..

సదరు ఉన్నతాధికారి ఈ మధ్యకాలంలో అత్యంత కీలకమైన పదవుల్లో తనకు కావలసిన వారిని తెచ్చి పెట్టుకున్నట్లు చెబుతున్నారు. వీరిలో ఓ అధికారిని నిబంధనలకు విరుద్ధంగా నియమించినట్లు తెలిసింది. పైగా ఆయనకు మరోసారి కొనసాగింపు ఇచ్చారు. అలాగే ఐదు అదనపు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చారు. అలాగే తనకు కావలసిన వ్యక్తిని అడ్డగోలుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమించి.. అదనపు జీతాన్ని చెల్లిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సదరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను నియమించుకునే సమయానికి వర్సిటీలో ఆయన బోధించే కోర్సు లేదు. ఆయనకు ఉద్యోగం ఇచ్చిన కొన్ని నెలల తర్వాత కోర్సు ప్రారంభించడం గమనార్హం. ఆ ఉన్నతాధికారి కొన్నాళ్ల నుంచి వర్సిటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న తెలుగువారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు పది మందికిపైగా తెలుగువారిని (నాన్‌ టీచింగ్‌) వివిధ కారణాలు చెప్పి తొలగించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 11 మందిని నియమించుకుని కీలక బాధ్యతలను అప్పగించారు. అసలు డ్రైవింగే రాని వ్యక్తిని హరియాణా నుంచి రప్పించి, వేలాది రూపాయలు చెల్లించి ఇక్కడే డ్రైవింగ్‌ నేర్పించి ఉద్యోగం కల్పించినట్టు చెబుతున్నారు. అతని భార్యకు ఉద్యోగాన్ని కల్పించడంతోపాటు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కమిటీలకు స్వస్తి..

సాధారణంగా వర్సిటీలో వివిధ రకాల కమిటీలు ఉంటాయి. ఆయా కమిటీల్లో వర్సిటీలోని ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. నిధుల వినియోగం, కొనుగోళ్లు వంటి వ్యవహారాలను ఈ కమిటీలు చూస్తాయి. అయితే ప్రస్తుతం వర్సిటీలో ఆ ఉన్నతాధికారికి ఆప్తులైన వారితో కూడిన ఒకే ఒక్క కమిటీ మినహా.. మరే కమిటీలు లేవు. ఫ్యాకల్టీ మీటింగ్స్‌ ఎప్పటికప్పుడు పెడుతూ ఉండాలి. సదరు ఉన్నతాధికారి వచ్చాక ఒకట్రెండు భేటీలకు మించి పెట్టిన దాఖలాలు లేవు.

యూపీకి తరలించేందుకు...

ప్రస్తుత ఉన్నతాధికారి గతంలో ఈ పెట్రోలియం వర్సిటీని ఉత్తరప్రదేశ్‌కు తరలించాలని కేంద్ర పెట్రోలియం శాఖను కోరారు. దీనిపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈయన వచ్చినప్పటి నుంచీ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. డిప్యుటేషన్‌పై తెచ్చుకున్న ఒక ఉద్యోగిని పర్మనెంట్‌ చేయాలని బీవోజీతో సిఫారసు చేయించడం నియమావళికి విరుద్ధం. పాలనా విభాగంలో స్థానికులకు (తెలుగు వాళ్లకు) అవకాశం కల్పించాలని అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్వయంగా సూచించారు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ జరుగుతోంది. ఆహారం బాగుండడం లేదని ఫిర్యాదు చేసిన విద్యార్థులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించి సమస్యను పరిష్కరించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 03:23 AM