Share News

పంట కోసం.. ప్రాణం బలి

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:07 AM

దేశంలోని గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు (పెస్టిసైడ్స్‌) పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి.

పంట కోసం.. ప్రాణం బలి

  • పంటలపై చల్లే పెస్టిసైడ్స్‌తో రైతులకు క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత

  • వైద్య సిలబ్‌సలో లేని ‘పెస్టిసైడ్‌ టాక్సికాలజీ’

  • 3 నిమిషాల లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు

  • రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు

  • శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో అమలు చేసేదెప్పుడో?

  • ఓయూ పరిశోధకుడు డా.దొంతి నరసింహారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): దేశంలోని గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు (పెస్టిసైడ్స్‌) పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భస్థ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని మన దేశ వైద్య వ్యవస్థ పసిగట్టలేకపోతోంది. ఈ పెనుముప్పును గుర్తించడంలో, రోగ నిర్ధారణ చేయడంలో, ప్రభుత్వాలకు నివేదించడంలో విఫలమవుతోంది. పరిశోధనా పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రసాయనాల ముప్పు.. ఆస్పత్రుల క్లినికల్‌ ప్రాక్టీ్‌సలో మాత్రం లేకుండా పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రసాయన మందుల వాడకంతో తలెత్తుతున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలపై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి రూపొందించిన నివేదిక అకాడమీయా.ఎడ్యు జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది. ఆయన పరిశోధనలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


15సార్లు స్ర్పే.. అయినా గుర్తించలేని వైద్యులు

పంజాబ్‌లో పత్తి పండించే మాల్వా ప్రాంతాన్ని నేడు దేశం క్యాన్సర్‌ బెల్ట్‌గా పిలుస్తోంది. అక్కడ జాతీయ సగటు (లక్షకు 80మంది) కంటే ఎక్కువగా, ప్రతి లక్ష మందిలో 136మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. బటిండా నుంచి పటియాలాకు వెళ్లే రైలును స్థానికంగా క్యాన్సర్‌ రైలుగా పిలుచుకుంటున్నారు. ఇక్కడి రైతులు ఒక పంట కాలంలో ఏకంగా 15సార్లు పురుగుమందులు కొడుతున్నారు. ఈ మందుల పిచికారీతో రైతుల డీఎన్‌ఏ తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (పంజాబ్‌) పరిశోధనల్లో తేలింది. కేరళలోని కాసరగోడ్‌ ఎండోసల్ఫాన్‌ విషాదం, ఏపీలో ఉద్దానం కిడ్నీ వ్యాధులు.. ఇవన్నీ పురుగుమందుల వాడకంతో వచ్చినవేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే అక్కడి స్థానిక వైద్యులు మాత్రం వీటిని ధ్రువీకరించలేకపోతున్నారు. రోగులకు క్యాన్సర్‌ వస్తే పొగాకు, మద్యం వంటి అలవాట్లను సాకుగా చూపిస్తున్నారే తప్ప.. వారు పీల్చిన రసాయన గాలిని, తాగిన కలుషిత నీటిని అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒక రైతు ఒక ఏడాది పంట కాలంలో పురుగుమందుల కొనుగోలుకు, వాటి పిచికారీ కోసం సుమారు రూ.30వేలు ఖర్చు చేస్తుంటే.. ఆ పంట ద్వారా రూ.40వేల ఆదాయం వస్తోంది. అయితే ఆ పెస్టిసైడ్స్‌ ద్వారా వచ్చే జబ్బులకు చికిత్స కోసం రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు.


వైద్య విద్యలోనే లోపం.. అప్‌డేట్‌ కాని సిలబస్‌

మన వైద్య కళాశాలల్లో మెడికోలకు బోధించే జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) కరిక్యులంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి ఎత్తి చూపారు. రసాయన విషాల గురించి వివరించే టాక్సికాలజీని కేవలం ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో భాగంగా క్రిమినల్‌ కేసులు, శవపరీక్షల కోణంలోనే బోధిస్తున్నారు. నేటి వైద్యులకు 1990 కాలం నాటి ఆర్గానోఫాస్ఫేట్‌ విషాల గురించి మాత్రమే అవగాహన ఉంది. ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుతున్న ‘నియో నికోటినాయిడ్స్‌’, ‘పైరెథ్రాయిడ్స్‌’ హెర్బిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌తో కలగలపి వస్తున్న ఆధునిక రసాయనాల ప్రభావంపై వారికి కనీస శిక్షణ లేదు. దాంతో పురుగుమందుల కారణంగా వస్తున్న జబ్బులను పసిగట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. అలాగే ఇటువంటి ఆధునిక రసాయన మందులకు కనీసం యాంటీడోట్‌ను కూడా కనిపెట్టడం లేదు. ముఖ్యంగా నియోనికోటినాయిడ్‌ రసాయనాలు గర్భస్థ శిశువులు, చిన్నపిల్లల మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తాయని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, పల్లెల్లో పిల్లలు మానసిక వైకల్యంతో వస్తే వైద్యులు దానిని పోషకాహార లోపంగా భావిస్తున్నారే తప్ప.. తల్లిదండ్రుల రసాయన ఎక్స్‌పోజర్‌గా గుర్తించడంలేదు. ఇక వైద్య విద్యార్థులకు అందించే వైద్యుల నిరంతర విద్య (సీఎంఏసీ) కార్యక్రమాలను ఫార్మాస్యూటికల్‌ కంపెనీలే ఎక్కువగా స్పాన్సర్‌ చేస్తుండటంతో.. వారు కొత్త మందులు, ల్యాబ్‌ పరికరాల గురించే మాట్లాడుతున్నారు తప్ప.. వ్యవసాయ రసాయనాల వల్ల వచ్చే జబ్బులపై వారికి అవగాహన కల్పించడం లేదు.


మహిళల్లో రక్తహీనతకు అసలు కారణం ఇదేనా?

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌-5) ప్రకారం దేశంలో 57శాతం మంది మహిళలు, 67శాతం మంది పిల్లలు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రభుత్వం దశాబ్దాలుగా ఐరన్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నా పల్లెల్లోని మహిళల్లో రక్తహీనత తగ్గకపోవడం వెనుక పెద్ద రహస్యం దాగి ఉంది. గ్రామీణ మహిళలు ఎటువంటి రక్షణ లేకుండానే చేతులతో పురుగు మందులు కలపడం, తర్వాత ఆ దుస్తులను ఇంటివద్ద ఉతకడంతో వారి చర్మం ద్వారా ఆ రసాయనాలు శరీరంలోకి చేరుతున్నాయి. మాంకోజెబ్‌ వంటి బూజు నాశక మందులు (ఫంగిసైడ్స్‌) మానవ ఎర్ర రక్తకణాల గోడలను దెబ్బతీసి, ఎముక మజ్జలో రక్తం ఉత్పత్తి కాకుండా అణచివేస్తాయని అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపించాయి. కానీ, మన వైద్యులు వీరికి కేవలం ఐరన్‌ టాబ్లెట్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.


ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయంటే?

పొరుగు దేశమైన శ్రీలంకలో హాస్పిటల్‌ డేటా ఆధారంగా అత్యంత ప్రమాదకరమైన పురుగు మందులను దశల వారీగా నిషేధించారు. ఫలితంగా అక్కడ ఆత్మహత్యలు, రసాయన మరణాలు 20 ఏళ్లలో 70శాతం తగ్గాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏదైనా రసాయన అనారోగ్యం అనుమానం వస్తే.. ఏ వైద్యుడైనా 24 గంటల్లోగా స్థానిక ఆరోగ్య అధికారికి రిపోర్ట్‌ చేయడం చట్టరీత్యా తప్పనిసరి చేశారు. దీనికోసం అక్కడ పెస్టిసైడ్‌ ఇల్‌నెస్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ నడుస్తోంది. ఇక యూరోపియన్‌ యూనియన్‌లో మానవ బయో-మానిటరింగ్‌ ద్వారా ప్రజల శరీరాల్లోని పురుగుమందుల అవశేషాలు, స్థాయులను గుర్తిస్తూ విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కంపెనీలకు లేని జవాబుదారీతనం

అమెరికాలో రసాయన మందుల వల్ల క్యాన్సర్‌ వచ్చిందని దాదాపు 1.70 లక్షల మంది బేయర్‌-మోన్‌షాంటో కంపెనీలపై దావా వేయగా, సదరు కంపెనీ 2026 నాటికి బాధితులకు దాదాపు 11 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కానీ, మనదేశంలో ఒక్క రైతు కూడా ఏ కంపెనీపైనా కేసు వేయలేదు. బాధ్యత వహించే చట్టాలూ లేవు. చివరకు కాసరగోడ్‌ బాధితులకు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వమే రూ.500 కోట్ల నష్టపరిహారం ఇచ్చింది తప్ప.. కంపెనీల నుంచి రూపాయి కూడా రాలేదు.


రోగ నిర్ధారణ ఎలా?

ఒకవేళ వైద్యుడికి అనుమానం వచ్చినా.. రోగి శరీరంలో రసాయన అవశేషాలు ఎంత ఉన్నాయో పరీక్షించే కనీస మౌలిక సదుపాయాలు ఏ జిల్లా ఆస్పత్రిలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ అందుబాటులో ఉండటం లేదు. ఇక ఆర్గానోఫాస్ఫేట్‌ ప్రభావాన్ని గుర్తించే ప్రాథమిక ఎసిటైల్‌కోలినెస్టరేస్‌ పరీక్ష గానీ, రక్తాన్ని విశ్లేషించే పెస్టిసైడ్‌ రెసిడ్యూ ల్యాబ్‌లు గానీ గ్రామీణ భారతంలో అందుబాటులో లేవు. పరీక్షలు లేకపోవడం వల్ల కేసులు నమోదు కావు. కేసులు లేనందున ప్రభుత్వం ల్యాబ్‌లు ఏర్పాటు చేయదు. ఇలా ఈ వ్యవస్థ ఒక చక్రంలా తిరుగుతూ విషాదాన్ని కప్పిపుచ్చుతోంది.

రోగిని చూసేది 3 నిమిషాల్లోపే?

పురుగుమందుల పిచికారీతో వచ్చే జబ్బులను వైద్యులు గుర్తించకపోవడానికి ఆస్పత్రుల్లో పని ఒత్తిడి కూడా ఒక కారణం. ప్రభుత్వాస్పత్రుల ఓపీడీలలో ఒక రోగిని చూడడానికి డాక్టర్‌కు సగటున 2.2 నిమిషాలే ఉంటోంది. ఇంత తక్కువ సమయంలో వైద్యుడు కేవలం పైపైన పరీక్షించి మందులు రాయగలరు తప్ప.. ‘మీరేం పంట వేస్తారు? ఏ మందులు రేస్ప చేశారు? గ్లోవ్స్‌ వేసుకున్నారా?’ వంటి కీలక ప్రశ్నలను ఏ డాక్టర్‌ అడగడం లేదు. మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ జిల్లాలో పాన్‌ ఇండియా సర్వేలో రైతులకు పురుగు మందులతో వచ్చిన జబ్బులకు వైద్యులు సాధారణ మందులు ఇచ్చినట్లు తేలింది.


ఏం చేయాలంటే..

రాబోయే ‘పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు’లో వైద్య రంగాన్ని ఒక కీలక భాగస్వామిగా మార్చాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే వైద్య విద్య కరిక్యులంను మార్చాలి. మెడికోలకు ఆధునిక పెస్టిసైడ్‌ టాక్సికాలజీపై ప్రత్యేక అవగాహన కల్పించి, వాటిపై పరీక్షలు నిర్వహించాలి. సాగు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఎసిటైల్‌కోలినెస్టరేస్‌ ల్యాబ్‌ పరీక్షలను అందుబాటులోకి తేవాలి. కిడ్నీ, క్యాన్సర్‌, రక్తహీనత రోగుల రసాయన హిస్టరీని రికార్డ్‌ చేయడం తప్పనిసరి చేయాలి. వైద్యులకు జవాబుదారీతనం తప్పనిసరి చేయాలి. కాలిఫోర్నియా తరహాలో రసాయన జబ్బుల నమోదు కోసం జాతీయ ‘ఇల్‌నెస్‌ రిజిస్ర్టీ’ని ఏర్పాటు చేయాలి. సెంట్రల్‌ ఇన్సెక్టిసైడ్‌ బోర్డ్‌లో వ్యవసాయ అధికారులతో పాటు ఆంకాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పీడియాట్రీషియన్లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలి.

Updated Date - Jun 14 , 2026 | 04:11 AM