చంద్రబాబు పోతే విగ్రహం పెట్టేవాళ్లుండరు
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:07 AM
‘ఏ ఊరు వెళ్లినా వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులు కనిపిస్తాయి. చంద్రబాబు చేసిన ఒక్క పని కూడా కన్పించడం లేదు. చంద్రబాబు చనిపోయాక ఆయన విగ్రహం పెట్టే వాడు కూడా ఉండడు’ అంటూ వైసీపీ నేత...
నాలుకలపై వాతలు పెట్టాలి.. కోసి కారం పెట్టాలి
పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు
టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు
చాట్రాయి, మచిలీపట్నం టౌన్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘ఏ ఊరు వెళ్లినా వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులు కనిపిస్తాయి. చంద్రబాబు చేసిన ఒక్క పని కూడా కన్పించడం లేదు. చంద్రబాబు చనిపోయాక ఆయన విగ్రహం పెట్టే వాడు కూడా ఉండడు’ అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేటలో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సభలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలు, ఎన్టీఆర్ ఆరేళ్లు సీఎంలుగా పనిచేసి ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వీరికి చంద్రబాబుకు పోలిక ఎక్కడ? దేవుడి విషయంలో కూడా జుగుప్సాకర రాజకీయాలు చేయటం దుర్మార్గం. జగన్ తిరుమల ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వు కలపాడని చంద్రబాబు బుర్ర కథలు చెబితే పవన్ కల్యాణ్, బీజేపీ వాళ్లు డోలక్ వాయించారు. ఇటువంటి వాళ్ల నాలుకలపై వాతలు పెట్టి, గుత్తి వంకాయ కోసినట్లు కోసి కారం పెట్టాలి’ అని నాని వ్యాఖ్యానించారు. ఆఆయన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మచిలీపట్నంలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషిస్తూ, పేర్ని నాని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల వైషమ్యాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాలుకపై దబ్బళం కాల్చి గుచ్చాలి. ఒళ్లంతా వాతలు పెట్టాలి. పవన్ కల్యాణ్‌తో లక్షలాది ఆలయాలను కడిగించాలంటూ నాని బహిరంగ సభలోనూ, సోషల్ మీడియాలోనూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడమే. మా నాయకుడి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా మాట్లాడారు’ అంటూ శివగంగ పీఏసీఎస్ అధ్యక్షుడు పిప్పళ్ల కాంతారావు, మచిలీపట్నం అర్బన్ బ్యాంకు అధ్యక్షుడు దిలీప్, టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, ఎండీ ఇలియాస్ పాషా తదితరులు ఇనకుదురు సీఐ పరమేశ్వర్‌కు ఫిర్యాదు పత్రం సమర్పించారు. దీనిపై పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.