జల వివాదాలకు శాశ్వత పరిష్కారం ఇదే నా లక్ష్యం: చంద్రబాబు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:04 AM
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
ఐక్యతతోనే తెలుగుజాతి పురోగతి
విభేదాలు ఉండకూడదు
రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు
గంగా-కావేరి అనుసంధానం జరగాలి
తెలుగు మహాసభల్లో సీఎం ఆకాంక్ష
అమరావతి/గుంటూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాలూ సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి పురోగతి సాధ్యమవుతుందన్నారు. కలసి ఉంటే సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని.. మన మధ్య విద్వేషాలు ఉండకూడదని సూచించారు. గోదావరి నదిలో కావలసినంత నీరుందని.. ఈ నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా నీటికి కొరతే ఉండదని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటుంటే తానెప్పుడూ అడ్డు చెప్పలేదని గుర్తుచేశారు. గుంటూరు శివారులో సోమవారం ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను ప్రస్తావించారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి వీటి లోతుల్లోకి వెళ్లడం లేదని, ఐక్యత గురించే మాట్లాడతానని తెలిపారు. ‘మనం రెండు రాష్ట్రాలుగా ఉన్నా, తెలుగే మనకు మాతృభాష. తెలుగు వారంతా ఐకమత్యంగా ఉంటేనే అగ్రస్థానంలో నిలుస్తాం. నాడు సాగునీటి వ్యవస్థకు దారి చూపింది ఎన్టీఆరే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన హయాంలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశాను. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో నీటిని పొదుపు చేసి 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశా. అలీసాగర్, గుప్త, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు అందించాం.
ప్రతి ఏడాది గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోంది. గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. దేశంలో నీటి సమస్యల పరిష్కారం కావాలన్నదే నా అభీష్టం. అందుకోసం నదులన్నింటినీ అనుసంధానించి నీటిని పూర్తిగా వినియోగించుకోవాలి. గంగానది నుంచి కావేరి వరకూ నదుల అనుసంఽధానం జరగాలి. ఏపీలో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అన్ని నదుల అనుసంధానమూ జరగాలి. గోదావరిలో నీళ్లు తెలంగాణ వాడుకున్నా ఇబ్బందేమీ లేదు. తెలుగు ప్రజల మధ్య విభేదాలు వద్దు. నా జీవితాశయం ఒక్కటే.. రెండు తెలుగు రాష్ట్రాలూ సహకారంతో కలిసే ఉండాలి’ అని ఉద్ఘాటించారు.