Share News

జనం సొమ్ముతో జల్సా!

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:00 AM

కార్పొరేషన్‌లో వైసీపీ పాలక పక్షం రూటే సప‘రేటు’. జనం సొమ్ముతో జల్సాలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఐదేళ్ల కాలంలో నగరాభివృద్ధి కంటే టూర్ల మీద ఎక్కువ దృష్టి సారించారు. ఆ పేరుతో భారీగానే జనం సొమ్మును ఖర్చు చేసేశారు. యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ ట్యాబ్‌లు, ఐ ఫోన్లను కూడా కొనుగోలు చేయించారు. ఒక పక్క కాంట్రాక్టర్లకు చేసిన పనులకు రూ.120 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. మరో పక్క యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గాలికి కొదిలేసిన వైసీపీ పాలక పక్షం జనం సొమ్ముతో జల్సాలు చేయటం చర్చనీయాంశంగా మారింది.

జనం సొమ్ముతో జల్సా!

- అధ్యయన యాత్రల పేరుతో విహార యాత్రలు

- ఐదేళ్లలో టూర్‌లకు రూ.1.41 కోట్లు ఖర్చు

- అధికార పార్టీ కార్పొరేటర్లు అడిగారని ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ట్యాబ్స్‌, ఐఫోన్లు

- రూ.అర కోటికిపైగా అయిన ఖర్చు

- వైసీపీ అధికారపక్షం తీరుపై సర్వత్రా విమర్శలు

కార్పొరేషన్‌లో వైసీపీ పాలక పక్షం రూటే సప‘రేటు’. జనం సొమ్ముతో జల్సాలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఐదేళ్ల కాలంలో నగరాభివృద్ధి కంటే టూర్ల మీద ఎక్కువ దృష్టి సారించారు. ఆ పేరుతో భారీగానే జనం సొమ్మును ఖర్చు చేసేశారు. యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ ట్యాబ్‌లు, ఐ ఫోన్లను కూడా కొనుగోలు చేయించారు. ఒక పక్క కాంట్రాక్టర్లకు చేసిన పనులకు రూ.120 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. మరో పక్క యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గాలికి కొదిలేసిన వైసీపీ పాలక పక్షం జనం సొమ్ముతో జల్సాలు చేయటం చర్చనీయాంశంగా మారింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ నగర పాలక సంస్థ చరిత్రలో ఏ పాలకపక్షం చేయని విధంగా జల్సాల కోసం వైసీపీ భారీగా ఖర్చు చేసింది. అధ్యయన యాత్రల పేరుతో విహార యాత్రలను నిర్వహించింది. అధ్యయనం చేసినట్టుగా, వారు చెప్పినట్టుగా చూసినా.. నగరంలో ఎక్కడా కూడా అలాంటి మార్పులు చేపట్టలేదు. గతంలో పాలకపక్షాలు ఎన్నికైన కొత్తలో నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చన్న దానిపై కార్పొరేటర్లకు అవగాహన కోసం ఒకసారి మాత్రమే అధ్యయన యాత్రలు నిర్వహించేవారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అధ్యయన యాత్రలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. కార్పొరేటర్లు జంటలుగా గదులు తీసుకోవటం.. ఆ విషయం బయటకు పొక్కి.. నానా గొడవలకు దారి తీసింది. ఆ తర్వాత బెజవాడ కార్పొరేషన్‌ లో కాలుమోపిన వైసీపీ పాలక పక్షం కూడా అధ్యయన యాత్రలను ప్రారంభించింది. ఈ స్టడీ టూర్లు ఒక ఏడాదికి పరిమితం కాలేదు. ఏ ఆర్థిక సంవత్సరానికి ఆ ఆర్థిక సంవత్సరాన నిర్వహించటం చేస్తున్నారు. స్టడీ టూర్ల పేరుతో రూ.లక్షలు దుబారా చేశారు. ఇప్పటి వరకు అధ్యయన యాత్రలలో గుర్తించిన అంశాలను విజయవాడ నగరంలో ఏం అమలు చేశారో చెప్పమంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.

రూ.కోటిన్నర వరకు ఖర్చు

వైసీపీ పాలక పక్షం వచ్చాక కార్పొరేటర్ల అధ్యయన యాత్రల పేరుతో అక్షరాల రూ.1.41 కోట్లను ఖర్చు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 40 మంది కార్పొరేటర్లు అధ్యయన యాత్రకు వెళ్లారు. అధ్యయన యాత్రకు రూ.35,20,329 ఖర్చు అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 41 మంది కార్పొరేటర్లు మళ్లీ అధ్యయన యాత్ర చేశారు. ఈ సందర్భంలో రూ.47 లక్షలు ఖర్చు అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 42 మంది కార్పొరేటర్లు అధ్యయన యాత్రకు వెళ్లారు. ఈ సారి రూ.59,40,534 ఖర్చు అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా అధ్యయన యాత్రకు ప్లాన్‌ చేశారు. తీవ్ర విమర్శలు రావటంతో నిలుపుదల చేశారు.

ఖరీదైన ట్యాబ్‌లు, ఫోన్లు కొనుగోలు

అధికార పక్షం కార్పొరేటర్ల నుంచి మొదట్లో యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ కంప్యూటర్లకు ప్రతిపాదనలు రావటంతో.. పాలకపక్షం ముందు వాటిని కొనుగోలు చేయాలని భావించింది. రూ. కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్క తేల్చటంతో వెనుకడుగు వేసింది. ఆ తర్వాత కార్పొరేటర్లకు యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ట్యాబ్‌లు, ఐ ఫోన్లు కొనివ్వాలని నిర్ణయించింది. మొత్తం 34 మంది కార్పొరేటర్లకు రూ.28,61,202 వ్యయంతో యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ట్యాబ్‌లను కొనుగోలు చేసి వారికి అందించటం జరిగింది. ఆ తర్వాత ఆపిల్‌ ఐ ఫోన్‌ 16 ప్లస్‌ 256 జీబీ ర్యామ్‌ సామర్థ్యం కలిగిన హై ఎండ్‌ ఫోన్లను కొనుగోలు చేసింది. మొత్తం 33 మంది కార్పొరేటర్లకు రూ.10,14,885 వ్యయంతో యాపిల్‌ ఐ ఫోన్లను కొనుగోలు చేసి అందించింది. యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ట్యాబ్‌లు, ఐ ఫోన్ల కోసం అక్షరాలా రూ.66,53,136 ఖర్చు చేయటం జరిగింది.

Updated Date - Feb 23 , 2026 | 01:00 AM