పెనుకొండలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:43 AM
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు, నగర పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.
‘అక్షరం అండగా..’ కార్యక్రమానికి స్పందన
పెనుకొండ టౌన్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు, నగర పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు విన్నవించారు. మంత్రి ఆదేశాల మేరకు నగర పంచాయతీ కమిషనర్ సతీశ్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో శనివారం ట్రాఫిక్ నియంత్రకు చర్యలు చేపట్టారు. పట్టణంలోని తెలుగుతల్లి సర్కిల్, శ్రీకృష్ణదేవరాయల సర్కిల్, దర్గా సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ఉన్న ఆక్రమణలను తొలగించారు. మిగిలిన ఆక్రమణలను వారం రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేదంటే తామే తొలగిస్తామని ఆక్రమణదారులకు అధికారులు చెప్పారు. ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న పూల వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఘనగిరి పూలమార్కెట్‌కు వెళ్లి వ్యాపారం చేసుకోవాలని సూచించగా, వ్యాపారులు అంగీకరించారు. వారికి సోమవారం లాటరీ పద్ధతిలో పూల మార్కెట్‌లో స్థలాలు కేటాయిస్తామని కమిషనర్ చెప్పారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడంతో పట్టణ ప్రజలు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’కు కృతజ్ఞతలు తెలిపారు.