పెను‘కొండ’పై టోల్‌గేట్‌తో నిఘా
ABN , Publish Date - May 07 , 2026 | 04:01 AM
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి వెళ్లే రహదారిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడేలా టోల్‌గేట్ ఏర్పాటు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట
‘ఆంధ్రజ్యోతి’ ‘అక్షరం అండగా’కు స్పందన
పెనుకొండ టౌన్, మే6(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి వెళ్లే రహదారిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడేలా టోల్‌గేట్ ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత బుధవారం ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో పెనుకొండలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు పలు సమస్యలు వివరించారు. పెనుకొండ కొండపైకి వెళ్లే రహదారి 7కి.మీ ఉందనీ, ఎటుచూసినా పచ్చదనం పరచుకుని, ఆహ్లాదాన్ని పంచుతోందన్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇతర ప్రాంతాల వారు పెద్దఎత్తున వస్తుంటారని, అయితే సరైన పర్యవేక్షణ లేక కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కార్యక్రమంలో మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వినూత్నంగా ఆలోచించి, అటవీశాఖ ఆధ్వర్యంలో కొండపైకి వెళ్లే రహదారిలో టోల్‌గేట్ ఏర్పాటు చేయించారు. దీంతో కొండపైకి వెళ్లే వారిపై సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతోపాటు టోల్ రుసుము వసూలు చేస్తారు. తద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.