పెద్ద దస్తగిరి హత్య వెనుక పెద్దకుట్ర
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:50 AM
దాదాపు ఏడేళ్ల క్రితం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తొలుత గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టి గొడ్డలిపోటు అని తేలడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నెట్టేశారు.
రూ.100 కోట్ల ఆస్తి లావాదేవీలే కారణం
ప్రధాన సూత్రధారి వైసీపీ నేత నిత్యానందరెడ్డి
ఇద్దరి మధ్య భారీ ఆర్థిక, రియల్ లావాదేవీలు
హత్యకు ఇవే కారణాలని అనుమానం
హతుడు, నిందితులూ.. నిత్యానంద అనుచరులే
హత్య జరిగిన రోజు గంజాయి ముఠా పనిగా చిత్రీకరించిన రోత పత్రిక
గుట్టు రట్టు కావడంతో ‘రాజకీయ హత్య’ రంగు
దస్తగిరి కుటుంబం పరామర్శ యాత్రకు జగన్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దాదాపు ఏడేళ్ల క్రితం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తొలుత గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టి గొడ్డలిపోటు అని తేలడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నెట్టేశారు. జగన్ పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాయించారు. ఇప్పుడు.. కడప వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య విషయంలోనూ వైసీపీ నాయకులు అచ్చం అదే డ్రామాను నడిపిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల ఆస్తి కోసం జరిగిన హత్యను తొలుత జగన్ పత్రిక గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా చిత్రీకరించింది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన పెద్ద దస్తగిరిని కనీసం వైసీపీ కార్యకర్తగా కూడా చెప్పుకొనేందుకు ఆ పార్టీ నేతలు కానీ, జగన్ పత్రిక కానీ సుముఖత చూపలేదు. అసలు పెద్ద దస్తగిరి వైసీపీకి సంబంధం లేని వ్యక్తిగా జగన్ పత్రిక కథనాలు రాసింది. చివరికి గుట్టు రట్టు కావడంతో ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్యకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఓదార్పు డ్రామాతో కథను రక్తి కట్టించాలని చూస్తున్నారు. కడప జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ ఆవరణలో ఈ నెల 6వ తేదీన జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నేత బండి నిత్యానంద రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. మృతుడితో పాటు నిందితులు కూడా నిత్యానందరెడ్డి అనుచరులే. మొదట ఇది రౌడీల మధ్య జరిగిన తగాదాగా పోలీసులు భావించారు. ఆ తర్వాత విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు, ఆ తర్వాత నిందితులు నిత్యానంద రెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన 3 గంటల్లోనే ముగ్గురు నిందితులు నిత్యానందరెడ్డిని కలిసినట్లు, నిందితులకు ఆయన ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. బండి నిత్యానందరెడ్డికి, పెద్ద దస్తగిరికి నడుమ భారీ ఆర్థిక, రియల్ ఎస్టేట్ డీల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద దస్తగిరి ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా సుమారు రూ.100 కోట్లు విలువైన ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. ఈ వంద కోట్ల ఆస్తి లావాదేవీలే పెద్ద దస్తగిరి హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిత్యానందరెడ్డి పరారీలో ఉన్నారు. పెద్ద దస్తగిరి హత్యకు రియల్ లావాదేవీలే కారణమని, హత్యకు సూత్రధారి వైసీపీ కీలక నేతగా చలామణి అవుతున్న నిత్యానంద రెడ్డే కారణమని తేలడంతో వైసీపీ అధిష్ఠానం ఖంగుతుంది. వెంటనే పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ హత్యగా ప్లేటు మార్చేసింది. వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. పెద్ద దస్తగిరి కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఉదంతం వైసీపీ క్రిమినల్ రాజకీయానికి అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.