Share News

పెదపేట వివాదాస్పద ఆలయం కూల్చివేత

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:24 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో వివాదాస్పద ఆలయాన్ని శనివారం రాత్రి కూల్చివేశారు. అంతకుముందే ఆలయంలోని...

పెదపేట వివాదాస్పద ఆలయం కూల్చివేత

  • పోలీసు బందోబస్తు నడుమ శిథిలాల తొలగింపు

ఆకివీడు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో వివాదాస్పద ఆలయాన్ని శనివారం రాత్రి కూల్చివేశారు. అంతకుముందే ఆలయంలోని శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి, నందీశ్వరుని విగ్రహాలను అర్చకులు సంప్రోక్షణ చేసి దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆకివీడు పెద్దింట్లమ్మ గుడిలో భద్రపరిచారు. పెదపేటలో రామాలయ నిర్మాణాన్ని స్థానిక దళితులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమి వేడుకల సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఆలయానికి వెళ్లినప్పుడు కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆకివీడు మండలంలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే శిథిలావవస్థకు చేరుకున్న పెదపేట ఆలయాన్ని శనివారం రాత్రి 11 గంటల నుంచి పోలీసుల భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ, నగర పంచాయతీ అధికారుల సమక్షంలో కూల్చివేసి, శిథిలాలను తొలగించారు. ఈ సందర్భంగా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులతో అర్చకులు శాంతి పూజలు చేయించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డీఎస్పీలు రఘువీర్‌ విష్ణు, విశ్వనాథ్‌, సుధాకర్‌ నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, సుమారు 125 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఆదివారం ఉదయం పది గంటలకు శిథిలాల తొలగింపు పనులు పూర్తిచేశారు. ఖాళీ స్థలం చుట్టూ గ్రీన్‌ మ్యాట్‌ కట్టారు. హైకోర్టు అనుమతులతో శిఽథిలావవస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించామని తహసీల్దార్‌ ఫరూఖ్‌ చెప్పారు. పెదపేటలో రామాలయం పునర్నిర్మాణానికి మే 3న ఉదయం 7.14 గంటలకు భూమిపూజ చేయనున్నట్టు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లో తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 05:24 AM