Share News

రాష్ట్రానికి వైసీపీ హానికరం!

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:12 AM

‘వైసీపీ ఎప్పటికీ రాకూడదు.. కూటమే మరోసారి.. (వైసీపీ నెవర్‌ ఎగైన్‌.. కూటమి వన్స్‌ ఎగైన్‌)’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో నినదించారు.

రాష్ట్రానికి వైసీపీ హానికరం!

  • ఇది నిరంతర హెచ్చరిక: పయ్యావుల

  • ‘వైసీపీ నెవర్‌ ఎగైన్‌.. కూటమి వన్స్‌ ఎగైన్‌’ అంటూ నినాదం

  • చంద్రబాబు హయాంలో భూములిస్తే కియా, హెచ్‌సీఎల్‌, అశోక్‌ లేలాండ్‌, హీరో వచ్చాయి

  • టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, గూగుల్‌ డేటా సెంటర్‌ కూడా..

  • వైఎస్‌ జమానాలో ఇచ్చిన భూముల్లోకి ఒక్క కంపెనీ కూడా రాలేదు

  • నాడు గనులు, ఎక్సైజ్‌ ఆదాయం ప్యాలెస్‌కు.. నేడు అంతా ఖజానాకే

  • బడ్జెట్‌ చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఎప్పటికీ రాకూడదు.. కూటమే మరోసారి.. (వైసీపీ నెవర్‌ ఎగైన్‌.. కూటమి వన్స్‌ ఎగైన్‌)’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో నినదించారు. రాష్ట్రానికి వైసీపీ హానికరమనే హెచ్చరికను నిరంతరం చేస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు గురువారం శాసనసభలో ఆయన సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్‌ దేశస్థుల తరహాలో రాష్ట్ర ప్రజలు కూడా మన రాష్ట్రమనే భావనను పెంపొందించుకోవాలని కోరారు. నయానాజీల తరహాలో గత పాలకులు విధ్వంసం సృష్టించారని ఘాటుగా విమర్శించారు. గోబెల్స్‌ తరహాలో ప్రచారానికి సొంత మీడియాను అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌ ప్రసంగంలో వైసీపీ గురించి 16 సార్లు, చంద్రబాబు గురించి 13 సార్లు ప్రస్తావించినట్లు జగన్‌ పత్రికలో రాశారని, వాస్తవానికి చంద్రబాబు చేస్తున్న మంచి పనుల గురించి ప్రతి పేజీలోనూ, వైసీపీ చేసిన ఘోరాలను ప్రతి పేరాలోనూ ప్రస్తావించాలని పయ్యావుల వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


అప్పట్లో ఒక్క కంపెనీ కూడా రాలేదు

కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన భూ కేటాయింపుల వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతోంది. కానీ, వైసీపీ హయాంలో కేటాయింపుల వల్ల నష్టం వాటిల్లింది. చంద్రబాబు హయాంలో భూములు కేటాయిస్తే కియా, హెచ్‌సీఎల్‌, అశోక్‌ లేలాండ్‌, హీరో కంపెనీ, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ వంటి సంస్థలు వచ్చాయి. వైఎస్‌ హయాంలో ఇచ్చిన భూముల్లోకి ఒక్క కంపెనీ కూడా రాలేదు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, వాన్‌పిక్‌, బ్రాహ్మణి స్టీల్స్‌కు భూములిచ్చినా ఒక్క కంపెనీ కూడా రాలేదు.

సీమ ఉత్పత్తులకు బ్రాండింగ్‌..

సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంతో పరిశ్రమల్లోకే కాకుండా రాయలసీమ పొలాల్లోకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చి కల్యాణదుర్గం నియోజకవర్గంలోని పొలాలు కొని, దానిమ్మకాయలు పండిస్తున్నారు. ముఖ్యమంత్రి చొరవతో రాయలసీమ ఉత్పత్తులకు అరకు తరహాలో అంతర్జాతీయ బ్రాండింగ్‌ రాబోతోంది. జగన్‌ సీఎంగా ఉండగా.. ఒకే ఒక్క సంతకంతో 102 రాయలసీమ ప్రాజెక్టులను రద్దు చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిర్మించడం లేదని అప్పటి ఇరిగేషన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ నాడు కేంద్రానికి స్పష్టం చేసిన డాక్యుమెంట్లు ఇవిగో (వాటిని మంత్రి సభ ముందుంచారు)! రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరూ వేసిన ఒక్కో ఓటుకు బడ్జెట్‌ ద్వారా 100 లాభాలు కల్పిస్తున్నాం. చంద్రబాబు దావోస్‌ పర్యటనలో 3 రోజుల్లో 36 సమావేశాలు పెట్టుకున్నారు. పర్యటనకు ముందు తర్వాత కూడా వరుస సమావేశాలతో ఆయన బిజీగా ఉన్నారు. ప్రజల కోసం పనిచేయడం ఆయనకు చాలా ఇష్టం.


రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటున్నాం..

రాజధాని కోసం తమిళనాడు నుంచి కర్నూలుకు.. అక్కడి నుంచి హైదరాబాద్‌.. ఇప్పుడు అమరావతికి వచ్చాం. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటున్నాం. జగన్‌ ఎన్నో పథకాలకు బకాయిలు పెట్టిపోయారు. ఇప్పుడు వాటిని చెల్లిస్తూ పాలన కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రక్షాళన కోసం మొదటి బడ్జెట్‌.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రెండో బడ్జెట్‌.. అభివృద్ధి-సంక్షేమం పరుగుల కోసం మూడో బడ్జెట్‌ పెట్టాం. అన్న క్యాంటీన్లతో ఓ కుటుంబానికి నెలకు రూ.2,500కు పైగా ఆదా అవుతోంది. స్త్రీశక్తి పథకంతో ఒక కుటుంబానికి నెలకు రూ.3,000 వరకు ఖర్చులు తగ్గుతున్నాయి. ఎన్టీఆర్‌ భరోసాతో దేశంలో ఎవ్వరూ ఇవ్వనంతగా పెన్షన్లు ఇస్తున్నాం. 15,000కిపైగా టీచర్‌ ఉద్యోగాలిచ్చాం. గత ప్రభుత్వంలో గనులు, ఎక్సైజ్‌ ఆదాయం తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్లింది. ఇప్పుడు కూటమి హయాంలో మైనింగ్‌ శాఖలో 33 శాతం, ఎక్సైజ్‌ శాఖలో 24 శాతం రాబడి పెరిగింది.

పులివెందుల సమస్యలు తీరుస్తున్నాం..

కనీసం పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను కూడా గత పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షల్లో ఆ నియోజకవర్గంలోని పెండింగ్‌ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. పులివెందులనే పట్టించుకోనివారు ఇక రాష్ట్రాన్నేం పట్టించుకుంటారు? ఆ నియోజకవర్గంలోని మల్లెల గ్రామంలో ఆడపిల్లల స్కూలు నిర్మాణం కోసం రూ.19.62 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా జగన్‌ పట్టించుకోలేదు. అరటి ప్రాసెసింగ్‌-ప్యాకేజింగ్‌ హౌస్‌ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. దానిని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర నీటిసరఫరా పథకం నిర్మాణాన్ని కూడా జగన్‌ పూర్తి చేయలేదు. బిల్లులనూ పెండింగ్‌లో పెట్టారు. వేంపల్లి నుంచి గండి రోడ్డు విస్తరణ, కాలేటి వాగు రిజర్వాయరును పట్టించుకోలేదు.

Updated Date - Feb 20 , 2026 | 04:13 AM