‘జల్ జీవన్’లో చెల్లింపుల వివాదం!
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:02 AM
ఇంటింటికీ తాగునీరు అందించే ‘జల్ జీవన్ మిషన్’ పథకం కింద పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారం వివాదానికి దారి తీసింది. ఈ పనులు చేపట్టిన వారిలో చిన్నస్థాయి కాంట్రాక్టర్ల నుంచి భారీస్థాయి కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు.
తమ బిల్లులు నిలిపేస్తున్నారని చిన్న కాంట్రాక్టర్ల ఆవేదన
వ్యవహారంపై ఆరా తీసిన చంద్రబాబు
చిన్న వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆదేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఇంటింటికీ తాగునీరు అందించే ‘జల్ జీవన్ మిషన్’ పథకం కింద పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారం వివాదానికి దారి తీసింది. ఈ పనులు చేపట్టిన వారిలో చిన్నస్థాయి కాంట్రాక్టర్ల నుంచి భారీస్థాయి కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వీరికి చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.3,638 కోట్లు విడుదల చేసింది. అయితే.. ఈ నిధులలో ముందుగా చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయిలో పెద్దకాంట్రాక్టర్లకు, కార్పొరేట్ సంస్థలకు భారీ మొత్తంలో చెల్లింపులు చేయడం, చిన్న కాంట్రాక్లర్లకు స్వల్ప మొత్తంలోనే నిధులు విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై చిన్న కాంట్రాక్టర్లతో కూడిన ‘నవ్యాంధ్ర కాంట్రాక్టర్ల అసోషియేషన్’ నిరసనకు దిగింది. తమ పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ.. విజయవాడ గొల్లపూడిలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద అసోసియేషన్ నాయకులు గత కొన్ని రోజులుగా మౌన దీక్ష చేపట్టారు. బిల్లులు సమర్పించి సంవత్సరాలు దాటిపోతున్నా.. తమకు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంవో) చేరడంతో చిన్న కాంట్రాక్టర్లకు ఎంత మొత్తం చెల్లించారంటూ సీఎంవో ఆరా తీసింది. దీనిపై ఆర్థిక శాఖ స్పందిస్తూ.. ఆ విషయం పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయిస్తుందని వివరణ ఇచ్చింది.
ఆర్‌డబ్ల్యూఎస్ వివక్ష?
జల్‌జీవన్ మిషన్ బిల్లుల చెల్లింపులో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు వివక్ష చూపిస్తున్నారని చిన్న కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో చెల్లించి తమకు అరకొర చెల్లింపులు చేస్తున్నారని పేర్కొంటున్నారు.
ఇబ్బందులు రావొద్దు: సీఎం
నిధులు విడుదల చేసి.. బిల్లులు చెల్లించాలని ఆదేశించినా కాంట్రాక్టర్లు నిరసన ఎందుకు చేస్తున్నారని సంబంధిత అధికారులను సీఎం నిలదీశారు. చిన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టి పెద్దవారికి ఎక్కువ మొత్తంలో నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని నిలదీశారు. ఎక్కడ తేడా జరిగిందనేది ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అదేసమయంలో చిన్న కాంట్రాక్టర్లకు ఎట్టిపరిస్థితిలోనూ ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్ల లెక్క ఇదీ..
జల్ జీవన్ మిషన్‌లో భాగస్వామ్యమైన చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులకు సంబంధించి చెబుతున్న లెక్క ఇదీ..
గత ఏడాది ప్రభుత్వం రూ.1,331 కోట్లు విడుదల చేసింది. దీనిలో కార్పొరేట్ సంస్థలకు రూ.932 కోట్లు చెల్లించారు. అలాగే మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చారు. చిన్న కాంట్రాక్టర్లకు కేవలం రూ.263 కోట్లు మాత్రమే చెల్లించారు.
ఈ నెల 19 నాటికి బిల్లుల బకాయి మొత్తం రూ.1492 కోట్లు. దీనిలో చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రూ.850 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌తో కలిపి కార్పొరేట్ కాంట్రాక్టర్ల బిల్లులు రూ.596 కోట్లు ఉన్నాయి.
ఈ నెల 19న పంచాయతీరాజ్‌శాఖ రూ.1600 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంలో రూ.707 కోట్లు జల్ జీవన్ మిషన్ ఎస్ర్కో ఖాతాకు జమ అయ్యాయి.
ఈ నెల 23న మొబిలైజేషన్ అడ్వాన్స్‌తో సహా కార్పొరేట్ సంస్థల బిల్లుల కోసం రూ.562 కోట్లు విడుదల చేశారు.
ఈ నెల 24న 442 మంది చిన్న కాంట్రాక్టర్లకు కేవలం 10 శాతం అంటే రూ.85.88 కోట్లు విడుదల చేశారు.
చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి రూ.1050 కోట్ల విలువచేసే బిల్లుల చెల్లింపునకు నిధులు సిద్ధంగా ఉన్నా ఇవ్వట్లేదు.