Share News

నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించండి

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:47 PM

రైతుల వ్యవసాయ భూములను, ప్రాజెక్టుల నీటి మునక జరిగినప్పుడు వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.

   నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించండి
రైతులకు చెక్కులు అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి)

రైతుల సంక్షేమంతోనే దేశాభివృద్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

కర్నూలు లీగల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రైతుల వ్యవసాయ భూములను, ప్రాజెక్టుల నీటి మునక జరిగినప్పుడు వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన భవనలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలతను ఆయన ప్రారంభించారు. న్యాయాధికారి మాట్లాడుతూ రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని సకాలంలో చెల్లించి వారి సంక్షేమానికి కృషి చేసినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందజేసేందుకు కర్నూలు కలెక్టర్‌ కొన్ని రోజులుగా సంబంధిత అధికారులతో మాట్లాడారన్నారు. దాదాపు రూ.81 లక్షల పరిహారాన్ని చెక్కుల ద్వారా రైతులకు అందించినట్లు ఆయన తెలిపారు. జాతీయ లోక్‌అదాలత ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 25 బెంచీలను ఏర్పాటుచేసి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం కోసం తన సహచర న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు, రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలు మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కమలాదేవి మాట్లాడుతూ కక్షిదారులు తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇటువంటి జాతీయ లోక్‌అదాలతలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, కర్నూలు బార్‌ అసోసియేషన అధ్యక్షులు హరినాథ చౌదరి, అదనపు జిల్లా జడ్జీలు పి.వాసు, లక్ష్మిరాజ్యం, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు సరోజనమ్మ, అనిల్‌ కుమార్‌, అనూషలతో పాటు పలువురు ఇన్సూరెన్స అధికారులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:47 PM