Share News

ఆలయాల పరిరక్షణ పాలక మండళ్ల బాధ్యత ’

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:31 AM

పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని.. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌...

ఆలయాల పరిరక్షణ పాలక మండళ్ల బాధ్యత ’

  • గత పాలక మండలిలో తిరుమలలో అపచారాలు: పవన్‌ కల్యాణ్‌

  • వర్చువల్‌ గా శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గం ప్రారంభం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని.. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే జరిగేవి కావన్నారు. కూటమి ప్రభుత్వంలో నియమించిన ఆలయ పాలక మండళ్లు.. ఆ తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తిలో రూ .10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును శుక్రవారం ఉదయం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి పవన్‌కల్యాణ్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘గత ప్రభు త్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత దేవదాయ మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నారు. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. శివరాత్రికి రెండు రోజుల ముందు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మా ర్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. శివరాత్రి తరువాత అటవీ శాఖ ఆధ్వర్యంలో మార్గానికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం’ అని అన్నారు.

త్వరలో శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనం..

అరుణాచలంలో గిరిప్రదక్షిణ గురించి విన్నాక.. తనకు కూడా గిరిప్రదక్షిణ చేయాలనిపించిందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకుంటానని వెల్లడించారు. అరుణాచలం లాగే ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, దేవదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్‌ లాల్‌ తదితరులు హాజరయ్యారు. శ్రీకాళహస్తి నుంచి వర్చువల్‌గా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పాలక మండలి చైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్‌, ఈవో బాపిరెడ్డి, రాష్ట్ర హస్త కళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పసుపులేటి హరిప్రసాద్‌, అటవీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:31 AM