Share News

పునర్విభజనలో..ప్రజా ప్రయోజనమే లక్ష్యం!

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:43 AM

రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

పునర్విభజనలో..ప్రజా ప్రయోజనమే లక్ష్యం!

  • రాష్ట్రంలో 100 మంది కొత్త వారికి చోటు

  • స్థానికంలోనూ గెలవాలి: పవన్‌

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో జనసేన పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. 2009లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు రాష్ట్రం, దేశంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా, ప్రజాప్రయోజనమే లక్ష్యంగా, సహేతుకంగా పునర్విభజన జరిగేలా ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలన్నారు. కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు పెరుగుతాయని తెలిపారు. ఇప్పుడున్న నియోజకవర్గాలను 50 శాతం పెంచాలన్న కేంద్రం నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ నిర్ణయంతో ఏపీలో 88 అసెంబ్లీ, 12 పార్లమెంట్‌ సీట్లు పెరుగుతాయని, కొత్తగా 100 మంది ప్రజాప్రతినిధులను చట్ట సభలకు పంపించే అవకాశం వచ్చిందని చెప్పారు. డీలిమిటేషన్‌పై జనసేన ఏవిధంగా ముందుకు వెళ్లాలి?. ఎటువంటి కార్యాచరణ అవలంభించాలి?. అనే అంశాలపై సూచనలు చేయడానికి ఎమ్మెల్యేలతో కూడిన కమిటీని నియమించాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ పరంగా కార్యాచరణ నిర్దేశించుకుందామన్నారు. రాష్ట్రంలో కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని, క్షేత్రస్థాయిలో కూటమి నేతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా కష్టపడాలన్నారు.


గత స్థానిక ఎన్నికల్లో అభిలషణీయ సంఖ్యలో గెలుపొందడం జనసేన శ్రేణుల పోరాట పటిమకు నిదర్శమని పేర్కొన్నారు. ‘ఉద్యమి’ సభ్యత్వం ఎంత అధికంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించిన విధానాన్నే ఇప్పుడు కూడా అనుసరించాలని సూచించారు. రాజకీయ కార్యకలాపాల్లో కుటుంబసభ్యుల ప్రమేయాన్ని ఎంత వరకు పరమితం చేయాలో ప్రజాప్రతినిధులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వ్యక్తులు చేసిన పనులు వారికే పరిమితం అవ్వాలని, పార్టీపై ప్రభావం పడకూడదని స్పష్టం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, ఎమ్మెల్సీలు నాగబాబు, పి. హరిప్రసాద్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 05:44 AM