బాధ్యతగా పన్నులు చెల్లించండి
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:49 AM
పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న ప్రైవేట్ సంస్థలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రైవేట్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ట్యాక్స్ ఎగవేస్తున్నాయి
పంచాయతీల సేవల్ని వాడుకుంటూ పన్నులు ఎగవేసే సంస్థల లెక్కలు తీయండి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న ప్రైవేట్ సంస్థలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఇంకా పన్ను పరిధిలోకి రాని అసె్‌సమెంట్లను స్వర్ణపంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పారదర్శకంగా పన్నులు చెల్లిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. ఉద్యోగులు జీతంలో సర్వీస్ ట్యాక్స్ కడుతున్నారని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మత్స్యకారులు కూడా పన్నులు చెల్లిస్తున్నారని, మరి విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎందుకు సరిగా చెల్లించడం లేదని ప్రశ్నించారు. రూ.10వేలు సంపాదించే ఉద్యోగుల మీద భారం పెట్టి రూ.100 కోట్లు ఆర్జించే వారిని వదిలేస్తున్నామన్నారు. ఆంధ్రా పేపర్ మిల్స్ లాంటి సంస్థలు కాలుష్యాన్ని వదలడమే కాకుండా పన్నులు కూడా ఎగవేస్తున్నాయన్నారు. పంచాయతీల్లో పన్నులు సరిగా వసూలు చేస్తే రూ.5,496 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, హోటళ్ల రీఅసె్‌సమెంట్ కోసం కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరులతో పాటు మొత్తం ఐదుగురు డీపీఓలతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమలు, హేచరీస్, హోటళ్లకు పంచాయతీలు అందిస్తున్న సేవలు, ఆ సంస్థలు విడుదల చేసే వ్యర్థాలు, చెల్లిస్తున్న పన్నులు, ఇంకా అసె్‌సమెంట్‌లోకి రాని ఆస్తులు తదితర వివరాలను కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయాలన్నారు. పంచాయతీల్లో లేఅవుట్లకు అనుమతిస్తున్న పట్టణాభివృద్ధి అథారిటీలు అక్కడ పారిశుధ్యాన్ని పట్టించుకోవడం లేదని, పన్నుల్లో పంచాయతీలకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తామని, పట్టణాభివృద్ధిశాఖ మంత్రితో చర్చించి పన్నులు నేరుగా పంచాయతీలకు జమయ్యే విధానం అమలయ్యేలా చూస్తామని పవన్ చెప్పారు. కాగా, గ్రామ పంచాయతీల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా పన్నులు వసూలు చేయాలని పవన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతుల్లో ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ రాకముందు రూ.75లక్షల ఆదాయం వస్తే స్వర్ణపంచాయతీ పోర్టల్‌లో అన్ని అసె్‌సమెంట్ల తర్వాత రూ.2.60 కోట్లకు ఆదాయం పెరిగిందని తిరుపతి డీపీఓ వివరించారు. జాతీయ అవార్డుల ద్వారా చిత్తూరు జిల్లాకు ఇన్సెంటివ్స్ సాధించిన డీపీఓ సుధాకర్‌ను ఈ సందర్భంగా పవన్ అభినందించారు. చెట్టినాడ్ సిమెంట్స్ పన్ను వసూళ్లలో అవకతవకలపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ ఆదాయం పెంచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌దండే, కమిషనర్ కృష్ణతేజ, పీఆర్, తదితరులు పాల్గొన్నారు.