‘హనుమాన్’ రక్ష!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:15 AM
‘‘ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకూ స్థానం ఉంది. మనం నమ్మే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని ‘హనుమాన్’ ఫౌండేషన్ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది.
ప్రజల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్
భూమిపై మనుషులతో పాటు జంతువులకూ స్థానం
వాటితో కలిసి జీవిద్దాం.. కలివిడిగా బతుకుదాం
మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నివారణకు చర్యలు
జంతువులతో పాటు పంటలు, ప్రజల ప్రాణాలు,
ఆస్తులను సంరక్షించడమే ప్రధాన కర్తవ్యం: పవన్
హనుమాన్ యాప్, 7 వైల్డ్‌లైఫ్ అంబులెన్సులు,
93 ఆర్‌ఆర్‌ఆర్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
అమరావతి/మంగళగిరి సిటీ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకూ స్థానం ఉంది. మనం నమ్మే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని ‘హనుమాన్’ ఫౌండేషన్ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్రంలో మానవ-వన్యప్రాణి సహ జీవనానికి మార్గదర్శకంగా హనుమాన్ ప్రాజెక్ట్ నిలుస్తుంది’’ అని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత అని, వన్యప్రాణులతో కలిసి జీవిద్దాం.. కలిసి బతుకుదాం అని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల వలన పంట, పశు సంపదకు నష్టంతోపాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే ఘటనలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళవారం ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ (హనుమాన్) ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్త పూర్తిస్థాయి అమలును పవన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ యాప్, 7 వైల్డ్‌లైఫ్ అంబులెన్సులు, 93 ఆర్‌ఆర్‌ఆర్ వాహనాలను కూడా ప్రారంభించారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అటవీ అధికారులు, ఎన్జీవోలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే..
‘సంఘర్షణ నుంచి సహజీవనం’ వైపు..
‘‘హనుమాన్ ఫౌండేషన్ అనేది మానవ, వన్యప్రాణుల సంఘర్షణల నివారణకు ఏర్పాటు చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం. ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగులు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చి పంట నష్టాలతో పాటు ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్నందున.. వీటిని ఎలా నివారించాలన్న ఆలోచన నుంచి పుట్టిందే హనుమాన్ ప్రాజెక్ట్. రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణి సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యం. అటు వన్యప్రాణులను సంరక్షిస్తూనే.. పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తులను సంరక్షించడమే ప్రధాన కర్తవ్యం. ఏఐ సహకారంతో వన్యప్రాణుల కదలికలను గమనించేలా టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ‘సంఘర్షణ నుంచి సహజీవనం’ వైపు మళ్లించడమే ప్రధాన ఉద్దేశం’’ అని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో వజ్ర బృందాల సన్నద్ధం
‘‘ఈ ప్రాజెక్ట్ కోసం మొదటిసారిగా రాష్ట్రంలో జీపీఎస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలతో కూడిన 100 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఇందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్, రెస్క్యూ(ఆర్‌ఆర్‌ఆర్) టీమ్ వాహనాలు, 7 వైల్డ్‌లైఫ్ అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరుట్లలో 4 వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మ రో 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీశాఖ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటర్నేరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్ల తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో ‘వన్యజీవ రక్షక్(వజ్ర)’లను నియమిస్తు న్నాం. వీరికి రెస్క్యూ కిట్స్ అందిస్తున్నాం. పాములు, జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేలా బృందాలకు శిక్షణ ఇస్తున్నాం’’ అన్నారు.
బాధితులకు పరిహారం రెట్టింపు
‘‘కూటమి ప్రభుత్వం వచ్చాక మానవ-జంతు సంరక్షణల్లో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహా రం చెల్లిస్తున్నాం. 2025-26లో ఇప్పటికి 2,107 కేసు లు నమోదు కాగా, రూ.4 కోట్ల మేర పరిహారం చెల్లించాం. కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, పంట నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచాం. జంతు దాడు ల్లో చనిపోయే వారి కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలకు పెంచాం. గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా రూ.2 లక్షలకు పెంచాం. చిత్తూరు, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో తీవ్రంగా ఉన్న ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకీ ఏనుగులను తీసుకొచ్చి, ఇప్ప టి వరకు 8 ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించాం. ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థను అటవీ శాఖ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తోంది.’’ అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
ప్రజలు, స్వచ్ఛంద సంస్థలూ భాగస్వామ్యమవ్వాలి
తొలుత పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. అటవీశాఖలో ఎన్నో సంస్కరణలకు ప్రభుత్వం నాంది పలికిందన్నా రు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణలను తగ్గించేలా చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేలా పవన్ కల్యాణ్ ఎంతో చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా హనుమాన్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడు తూ.. జంతువుల వల్ల ప్రాణ నష్టం జరిగినప్పు డు 24 గంటల్లోనే బాధితులకు పరిహారం అందే లా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గజప్రజ, సర్పమిత్ర వంటి కార్యక్రమాల ద్వారా వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏవైనా వన్యప్రాణులు ప్రజాబాహుళ్యంలో ఇబ్బంది కలిగించకుండా ఏఐ సాయంతో వాటిని తిరిగి అడవుల్లోకి పంపే చర్యలు హనుమాన్ ప్రాజెక్ట్‌తో జరుగుతాయని చెప్పారు. పవన్‌కు జంట ఏనుగుల ప్రతిమను బహుకరించారు.