ఆ ఇద్దరు చిన్నారులకు అండగా పవన్‌కల్యాణ్
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:03 AM
తల్లిదండ్రులను కోల్పో యాం.. ముందూ వెనుకా ఎవరూ లేరు. ఎంతోమంది అనాథ చిన్నారులను ఆదుకుంటున్న మీరు మమ్మల్ని కూడా ఆదుకోండి పవన్ సారూ...’’
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన చిన్నారుల వినతి
తక్షణమే స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్
ఇద్దరికీ ప్రతినెలా రూ.5 వేల వంతున ఆర్థిక సాయం
ఇల్లు మంజూరు.. చదువు బాధ్యత కలెక్టర్‌కు అప్పగింత
పిఠాపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘తల్లిదండ్రులను కోల్పో యాం.. ముందూ వెనుకా ఎవరూ లేరు. ఎంతోమంది అనాథ చిన్నారులను ఆదుకుంటున్న మీరు మమ్మల్ని కూడా ఆదుకోండి పవన్ సారూ...’’ అంటూ ఇద్దరు చిన్నారులు చేసిన వినతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి వారికి అండగా నిలిచారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన చిన్నారులు కరణం సత్య, చైతన్య చంటి రెండేళ్ల క్రితం తండ్రి శ్రీనును కోల్పోయారు. తల్లి జ్యోతి వారిని పోషించేది. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆమె కూడా ఇటీవలే మృతిచెందింది. దీంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. సత్య ఇంటర్ పూర్తి చేయగా.. చైతన్య ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వారు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో తమ దీన స్థితిని వివరిస్తూ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషయం పవన్‌కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో వారి వేదన ఆయనను తీవ్రంగా కదిలించింది. ఆయన ఇప్పటికే తన జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.5 వేలు వంతున అందజేస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారులకు కూడా ప్రతినెలా రూ.5 వేలు చొప్పున అందజేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. వారికి తక్షణమే ఇల్లు కట్టించాలని సూచించారు. ఇద్దర్నీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూల్, తదనంతరం కళాశాలలో చేర్పించే బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.