Deputy Chief Minister Pawan Kalyan: 50శాతం పచ్చపచ్చగా!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:47 AM
రాష్ట్రంలోని తీర ప్రాంతాలు హరిత వనాలుగా మారనున్నాయి. ఇవి సమీప ప్రాంతాలకు ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కూడా కల్పించనున్నాయి.
తీరానికి హరిత హారం
సమీప ప్రాంతాలకు రక్షణ ఛత్రం
గ్రేట్ గ్రీన్ వాల్, గ్రీన్ కవర్‌కు నెలాఖరులోగా రూట్ మ్యాప్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని తీర ప్రాంతాలు హరిత వనాలుగా మారనున్నాయి. ఇవి సమీప ప్రాంతాలకు ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కూడా కల్పించనున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, 50ు గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, ఈ నెలాఖరులోగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో అటవీశాఖ లక్ష్యాలు, పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో మొక్కల భద్రత, అటవీ భూముల సంరక్షణ బాధ్యతను సమీపంలో నివసించే వారికి అప్పగించాలన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడంతో పాటు రాష్ట్రాన్ని 50ు పచ్చదనంతో నింపాలని సీఎం చంద్రబాబు చేసిన నిర్దేశం మేరకు ‘గ్రీన్ కవర్’ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలన్నారు. ‘‘అన్ని ప్రభుత్వ శాఖలతో కలసి టాస్క్‌ఫోర్స్ పని చేయాలి. తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పున మడ, సరుగుడు, తాటి చెట్లతో పచ్చదనం ఉండేలా చూడాలి. ఇప్పటికే 420 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీశాఖ మొక్కలు నాటి, సంరక్షణ చర్యలు చేపడుతోంది. మిగిలిన భూముల్లో.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూమి ఎంత? అటవీశాఖ పరిధిలో ఎంత ఉంది? ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లో ఎంత భూమి ఉందో అధ్యయనం చేయాలి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌ను మూడు దశల్లో ముందుకు తీసుకెళ్లాలి.’’ అని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
దశల వారీగా..
మొదటి దశలో కోస్తా ప్రాంతాన్ని ఆనుకుని ఉండే మొత్తం విస్తీర్ణంలో మొక్కలు పెంచాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రెండో దశలో తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కాలువలు, రోడ్లు, డొంకల వెంట మొక్కలు నాటాలన్నారు. చివరి దశలో వ్యవసాయ భూముల్లోనూ రైతులకు ఉపయోగపడేలా మొక్కలు పెంచాలని సూచించారు. గ్రీన్ క్లైమేట్ ఫండ్, సీఎ్‌సఆర్, వీబీజీ-రామ్‌జీ పథకం నిధులతో మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు. 50ు గ్రీన్ కవర్ ప్రాజెక్టులో మొక్కలు నాటేందుకు అనుకూల ప్రాంతాలను గుర్తించాలని, దీనికోసం జిల్లాల వారీగా సంబంధిత శాఖలను కలెక్టర్లు సమన్వయం చేయాలని సూచించారు. గ్రేట్ గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ పనుల్లో కచ్చితమైన పురోగతి కనిపించాలన్నారు. ‘‘రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో నోటిఫై కాని మడ అడవులు ఉన్నట్లు శాటిలైట్ చిత్రాతో గుర్తించాం. ఈ మొత్తాన్నీ నోటిఫై చేసి, అటవీశాఖకు అప్పగించే చర్యలు తీసుకుంటాం. ముందుగా ఆ భూములు ఆక్రమణలకు గు రి కాకుండా చర్యలు తీసుకోవాలి. మడ అడవుల రక్ష ణ, గ్రేట్ గ్రీన్ వాల్, గ్రీన్ కవర్‌పై తీర ప్రాంత ప్రజ లు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన కల్పించాలి. శాఖల వారీగా సమీక్షలు జరపాలి. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూ ర్తి చేయాలి.’’ అని పవన్ నిర్దేశించారు. ఈ సమీక్షలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.